ఇలాంటి రాజకీయాలతో పవన్ ఏమి సాధిస్తారో?

January 22, 2018


img

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు కొండగట్టు ఆంజనేయస్వామివారిని దర్శించుకొన్న తరువాత తెలంగాణాలో తన యాత్ర ప్రారంభించారు. తనపై పొన్నం ప్రభాకర్ చేసిన విమర్శలకు బదులిస్తూ, “అవును కెసిఆర్ ను కలిశాను. అయనే కదా పోరాడి తెలంగాణా రాష్ట్రాన్ని సాధించారు?నూతన సంవత్సరం సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపాను. అందులో తప్పేముంది?” అని ప్రశ్నించారు. 

తెలంగాణాలో జనసేన పార్టీ ఏవిధంగా ముందుకు సాగబోతోంది?అనే విలేఖరుల ప్రశ్నకు “ముందుగా అందరికీ చెప్పేదేమిటంటే నేను ప్రభుత్వాలతో పోరాడటానికి రాలేదు. నిర్మాణాత్మకమైన రాజకీయాలు చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తాను తప్ప ప్రభుత్వాలపై నోటికి వచ్చిన విమర్శలు చేస్తూ విద్వంసకర రాజకీయాలు చేయము. దశాబ్దాల పోరాటాల తరువాత తెలంగాణా ఏర్పడింది. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించడానికి  ముఖ్యమంత్రి కెసిఆర్ గట్టిగానే కృషి చేస్తున్నారు. అయితే కొన్ని సమస్యలు, సవాళ్ళు కారణంగా కొన్నిటిని పరిష్కరించడంలో ఆలస్యం అవుతోంది. తెలంగాణాలో నెలకొనున్న అపరిష్కృత సమస్యల గురించి మేధావుల సూచనలు, సలహాలు తీసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలనుకొంటున్నాము. ప్రభుత్వం స్పందన బట్టి ఏమి చేయాలో ఆలోచించుకొంటాము. రెండు తెలుగు రాష్ట్రాలలో మాకు బలం ఉన్నచోటే పోటీ చేస్తాము. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలన్నీ కనీసం 2-3 దశాబ్ధాల పాటు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాక నిలద్రొక్కుకోగలిగాయి. మా పార్టీ నిలద్రొక్కుకోవడానికి కూడా కనీసం అంత సమయం పడుతుందని మానసికంగా సిద్దపడే రాజకీయాలలోకి వచ్చాను,” అని చెప్పారు.

నిర్మాణాత్మకమైన రాజకీయాలు చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పుకోవడం బాగానే ఉంది కానీ అది ప్రభుత్వాలకు సహకరిస్తూ రాజకీయాలు చేస్తానని చెప్పుకొంటున్నట్లుంది. ఇక ప్రజా సమస్యల గురించి ప్రభుత్వానికి గుర్తు చేసేందుకు ఇప్పటికే చాలా పార్టీలు, ప్రజా సంఘాలు ఉన్నాయి కనుక పవన్ కళ్యాణ్ మళ్ళీ కొత్తగా గుర్తు చేయవలసిందేమీలేదనే చెప్పాలి. ఏపిలో పవన్ కళ్యాణ్ పోషిస్తున్న ‘నిర్మాణాత్మకమైన పాత్ర’ కారణంగానే ఆయనపై ‘తెదేపా ఏజంట్’ అనే ముద్ర పడింది. ఇప్పుడు తెలంగాణాలో కూడా అటువంటి పాత్రే పోషించబోతున్నానని చెప్పుకొన్నారు కనుక ‘తెరాస ఏజంట్’ అనే ముద్ర పడుతుంది. అంతే! పొన్నం ప్రభాకర్ అప్పుడే ఆ మాట అనేశారు కూడా! కనుక ఇటువంటి ఆలోచనలతో రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ‘కింగ్ మేకర్’ పాత్రకే పరిమితమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.


Related Post