హరీష్ కాంగ్రెస్ ఉచ్చులో చిక్కుకొంటున్నారా?

January 22, 2018


img

గవర్నర్ నరసింహన్ కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్, హరీష్ రావులను ప్రశంసించడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుపడుతూ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఉన్నారు కనుక వారు ఆవిధంగా ప్రవర్తించడం సాధారణమైన విషయమే. కనుక తెరాస సర్కార్ వారి విమర్శలను పట్టించుకోకుండా ఊరుకొని ఉండి ఉంటే కాంగ్రెస్ నేతలే ప్రజలలో పలుచన అయుండేవారు. కానీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించి, కాంగ్రెస్ నేతలు విసిరిన ఉచ్చులో చిక్కుకొన్నట్లయింది. పైగా గవర్నర్ నరసింహన్ ను తెరాస సర్కార్ ఎంతగా వెనకేసుకువస్తే అంతగా ప్రతిపక్షాలకు ఆయనను విమర్శించేందుకు అవకాశం కల్పించినట్లవుతుంది. 

కాంగ్రెస్ హయంలో చేవెళ్ళ-ప్రాణహిత ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారని హరీష్ రావు ప్రశ్నించారు. తమ ప్రభుత్వం రాష్ట్రానికి మేలు చేసే ప్రాజెక్టులను నిర్మిస్తున్నందుకు గవర్నర్ తమను మెచ్చుకొన్నారని, కానీ కాంగ్రెస్ నేతలు ఆ చిన్న మెచ్చుకోలు మాటను కూడా జీర్ణించుకోలేక గవర్నర్ నరసింహన్ పై కువిమర్శలు చేస్తున్నారని అన్నారు. కనుక కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్ పై చేసిన విమర్శలు ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. 

హరీష్ రావు బాగానే స్పందించారు కానీ కాంగ్రెస్ నేతలకు మళ్ళీ తన మాటలపై స్పందించే అవకాశం కల్పించినట్లయింది. వారు రేపు గవర్నర్ పై చర్చను పక్కనపెట్టి ప్రాజెక్టుల నిర్మాణం, వాటిలో అవినీతి గురించి మాట్లాడినా మాట్లాడవచ్చు. కొన్నిసార్లు ప్రభుత్వాన్ని గట్టిగా వెనకేసుకువచ్చే ప్రయత్నంలో ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తే, అది వారికే అనుకూలమైన పరిస్థితి కల్పించవచ్చు. కనుక కొన్ని విమర్శలకు మౌనం కూడా మంచి సమాధానమే అవుతుందని గ్రహించాలి.


Related Post