గవర్నర్ పై కాంగ్రెస్, భాజపాలు ఆగ్రహం

January 22, 2018


img

గవర్నర్ నరసింహన్ మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించిన తరువాత త్వరలోనే ఆ ప్రాజెక్టు పూర్తికాబోతోందని, దాంతో తెలంగాణా రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్, సాగునీటిశాఖ మంత్రి హరీష్ రావులపై ఆయన ప్రశంశల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ను ‘కాళేశ్వరం చంద్రశేఖర్ రావు’ అని, మంత్రి హరీష్ రావును ‘కాళేశ్వర రావు’ అని పిలవాలనిపిస్తోందన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ కు వంతపాడుతున్నందుకు గవర్నర్ నరసింహన్ పై కాంగ్రెస్ నేతలు ఇప్పటికే చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల వారు ఒక వినతిపత్రం ఇవ్వడానికి రాజ్ భవన్ వెళ్ళినప్పుడు ఆయనకు వారికీ మద్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు జరిగాయి. ఈ నేపధ్యంలో వారి విమర్శలను నిజమని నిరూపిస్తున్నట్లు గవర్నర్ నరసింహన్ మళ్ళీ కెసిఆర్ ను పొగడటంతో సహజంగానే కాంగ్రెస్ నేతలకు ఆగ్రహం కలిగింది. 

సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ, “ఈ ప్రాజెక్టు త్వరలోనే పూర్తవుతుందని గవర్నర్ నరసింహన్ ప్రకటించారు. ఒకవేళ కాకపోతే అప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ తో బాటు ఆయన కూడా జవాబుదారి అవుతారు. అప్పుడు మేము తప్పకుండా ఆయనను గట్టిగా నిలదీస్తాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అయనను తప్పించడం ఖాయం,” అని అన్నారు.


కొన్ని రోజుల క్రితమే ఏపి భాజపా నేతలు గవర్నర్ నరసింహన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయన ఏపికి ఒక గెస్ట్ గవర్నర్ లాగ వ్యావహరిస్తున్నారని, కనుక ఏపికి పూర్తిస్థాయి గవర్నర్ ను నియమించాలని కేంద్రానికి లేఖలు వ్రాశారు. ఇప్పుడు తాజాగా తెలంగాణా భాజపా నేతలు కూడా గవర్నర్ నరసింహన్ పై విమర్శలు మొదలుపెట్టారు. 

మాజీ కేంద్రమంత్రి, ఎంపి బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ, “గవర్నర్ నరసింహన్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడం, దాని నిర్మాణం కోసం జరుగుతున్న కృషిని, అందుకు కారకులను మెచ్చుకోవడంలో తప్పులేదు. కానీ ఆ ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రప్రభుత్వం అందిస్తున్న సహాయసహకారాల గురించి అయన ప్రస్తావించకపోవడం బాధాకరం. దానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రప్రభుత్వం అడుగడుగునా ఎంతో సహాయసహకారాలు అందిస్తున్నారు. కానీ తెరాస సర్కార్ మాత్రం అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మిస్తున్నట్లు గొప్పలు చెప్పుకొంటోంది. కేంద్రం అందిస్తున్న సహాయసహకారాల గురించి తెరాస మంత్రులు చెప్పకపోయినా కనీసం గవర్నర్ నరసింహన్ చెప్పి ఉండి ఉంటే బాగుండేది,” అని అన్నారు.


Related Post