రేవంత్, కోమటిరెడ్డి, మల్లు కలిసి పాదయాత్ర?

January 22, 2018


img

టి-కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక చిక్కు సమస్య ఎదురైంది. చాలా కాలంగా పాదయాత్ర చేయాలనుకొంటున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు పదవి ఆశిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొత్తగా పార్టీలో చేరి తన సత్తా చాటుకోవాలనుకొంటున్న రేవంత్ రెడ్డి ముగ్గురూ రాష్ట్రంలో పాదయాత్రలు చేయడానికి అనుమతి కోరుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖలు వ్రాసినట్లు తెలుస్తోంది. 

వారి పాదయాత్రల వలన పార్టీ బలోపేతం అవుతుంది కానీ ఎవరికి వారు వేర్వేరుగా పాదయాత్రలు చేసుకొంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. కనుక ఫిబ్రవరి నెలాఖరులోగా జిల్లా కార్యవర్గాల నియామకాల ప్రక్రియను పూర్తిచేసి, కాంగ్రెస్ పార్టీ బాగా అచ్చొచ్చిన గద్వాల్ జిల్లాలోని ఆలంపూర్ జోగులాంబ ఆలయం నుంచి మార్చి మొదటివారంలో వారి ముగ్గురితో బాటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ (బస్సు)యాత్రలు మొదలుపెట్టాలని భావిస్తున్నారు. మార్చి నుంచి జూన్ 2వరకు బస్సుయాత్ర నిర్వహించి, దాని ముగింపు సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బారీ బహిరంగసభను నిర్వహించాలని భావిస్తున్నారు. దానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వానించి ఆ వేదికపై నుంచే ఎన్నికల సమరశంఖారావం పూరించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. 

త్వరలోనే పార్టీ సీనియర్ నేతలను సమావేశపరిచి పాదయాత్రల అభ్యర్ధనలపై చర్చించి తగు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే ఆ ముగ్గురిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి తమ సత్తాను చాటుకోవడానికే పాదయాత్ర చేయాలనుకొంటున్నారనేది బహిరంగ రహస్యం. అందరితో కలిసి పాదయత్ర చేస్తే అది ‘గుంపులో గోవిందా’ అన్నట్లే అవుతుంది తప్ప తమ ‘బలప్రదర్శన’కు వీలుపడదు. కనుక సామూహిక పాదయాత్రకు వారిరువురూ అంగీకరించకపోవచ్చు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని వారు విడివిడిగా పాదయాత్రలు చేయలేరు. చేస్తే అది తిరుగుబాటే అవుతుంది. కనుక టి-కాంగ్రెస్ కు వారి అభ్యర్ధన కాస్త ఇబ్బందికరమైనదేనని చెప్పవచ్చు. 


Related Post