సింగరేణి కార్మిక సంఘాలు సమ్మెకు సిద్దం అవుతున్నాయి. కార్మిక సంఘాల ఎన్నికల సందర్భంగా అధికార తెరాసకు అనుబంధ సంఘమైన టిబిజికెఎస్ తరపున ఎన్నికల ప్రచారం చేసిన ఆ సంఘం గౌరవాధ్యక్షురాలు, తెరాస ఎంపి కవిత అనేక హామీలు గుప్పించారని కానీ ఆ తరువాత మళ్ళీ ఇటువైపు మొహం తిప్పి చూడలేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. టిబిజికెఎస్ ఎన్నికలలో గెలిచిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ తాను స్వయంగా సింగరేణి వచ్చి ఇల్లిల్లు తిరిగి కార్మికుల పరిస్థితులు అడిగితెలుసుకొని వారి సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పారని కానీ రామగుండం వరకు వచ్చి వెళ్ళిపోయారే తప్ప సింగరేణికి రాలేదని అన్నారు.
ఆ రోజు ఆమె, ముఖ్యమంత్రి కెసిఆర్ ఇద్దరూ సింగరేణి కార్మికుల కోసం అనేక హామీలు గుప్పించారని కానీ వాటిలో ఒక్కటి కూడా ఇంతవరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిబిజికెఎస్ నేతలు అందరూ ముఖ్యమంత్రి కెసిఆర్ గుప్పిట్లో చిక్కుకొన్న కారణంగా ఎవరూ గట్టిగా నోరెత్తి మాట్లాడలేకపోతున్నారని సింగరేణి కార్మిక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్సీఈయూ- సీఐటీయూ, ఏఐటీయూసీ, ఎస్‌సీడబ్ల్యూయూ, ఐఎన్‌టీయూసీ కార్మిక సంఘాల నేతలు టి.రాజారెడ్డి, వై.గట్టయ్య, భూర్ల లక్ష్మీనారాయణ, బి.జనక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
హామీల అమలుకు జనవరి 25న సింగరేణిలో అన్ని ఏరియాలలో జిఎం కార్యాలయాల ముందు రిలే నిరాహారదీక్షలు మొదలుపెడతామని, ఫిబ్రవరి 14న ఒక్కరోజున టోకెన్ స్ట్రైక్ నిర్వహిస్తామని వారు ప్రకటించారు. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హామీల అమలుచేయకపోతే మార్చి నుంచి నిరవధికంగా సమ్మె చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
టిబిజికెఎస్ తరపున కవిత ఇచ్చిన హామీలు:
1. కారుణ్య నియామకాలు
2. స్వంత ఇళ్ళు లేని కార్మికులకు ఇళ్ళు కట్టుకోవడానికి రూ.10 లక్షలు వడ్డీలేని రుణం.
3. కార్మికులకు, వారి తల్లి తండ్రులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు.
4. మెడికల్ బోర్డు ఏర్పాటు.
5. కార్మికులు అందరి ఇళ్ళకు ఏసీ సౌకర్యం. ఇవికాక ఇంకా అనేక హామీలను కవిత గుప్పించారు.