హైదరాబాద్ లో నిన్న జరిగిన ‘సౌత్ కాంక్లేవ్-2018’ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి కెసిఆర్ అభివృద్ధిలో తెలంగాణాను ఆంధ్రాతో పోల్చవద్దని, ఆంధ్రా కంటే తెలంగాణా చాలా చాలా ముందుందని కెసిఆర్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి గత ప్రభుత్వాలు చేసిందేమీలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈరోజు ఏపి జిల్లాల కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు స్వయంగా ఈ ప్రస్తావన చేశారు. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేడు ఈ దుస్థితి కలిగింది అంటే అది ప్రజల తప్పు కాదు. ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా అనాలోచితంగా హడావుడిగా రాజకీయ ఉద్దేశ్యంతో రాష్ట్ర విభజన చేయడం వలననే నేడు రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడింది. అంత మాత్రాన్న ఏపి ప్రజలు చాతగాని వాళ్ళనుకోవడం తప్పు. హైదరాబాద్ ను ఎవరు అభివృద్ధి చేశారో అందరికీ తెలుసు. 1995కు ముందు తరువాత హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధిని పోల్చుకొని చూస్తే ఎవరు ఎంత అభివృద్ధి చేశారో అర్ధం అవుతుంది. హైదరాబాద్ ను అన్నివిధాల అభివృద్ధి చేశాక రాష్ట్రవిభజన కారణంగా కట్టుబట్టలతో బయటకు రావలసి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మొదటినుంచి పని మొదలుపెట్టవలసి వచ్చింది. రాష్ట్రవిభజన కారణంగానే ఏపికి ఈ దుస్థితి ఏర్పడిన మాట వాస్తవం కాదా?
రాష్ట్ర పరిస్థితి ఈవిధంగా ఉన్నప్పటికీ మేము ధైర్యం కోల్పోకుండా రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టేందుకు శతవిధాల కృషి చేస్తున్నాము. ఈ మూడేన్నరేళ్ళలో మా ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల వలన పరిస్థితి ఇప్పుడు కొంచెం మెరుగుపడింది. కానీ దక్షిణాది రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం అట్టడుగున ఉంది. రాష్ట్ర తలసరి ఆదాయం కనీసం రూ.35,000కు చేరినప్పుడే ఇతర రాష్ట్రాలతో పోటీ పడగలము. అందుకోసం మనం చేయవలసిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. కేంద్రం కూడా సహకారం అందించవలసి ఉంది. మొన్న ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు కూడా ఇదే మాట చెప్పాను. విభజన చట్టంలో ఇచ్చిన హామీలనే అమలుచేయాలని కోరాను. ఒకవేళ కేంద్రం అందుకు సహకరించకపోతే సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేయడానికి కూడా వెనుకాడబోము. అయితే కేంద్ర సహకారం కోసం న్యాయపోరాటాలు చేస్తూ విలువైన సమయం వృధా చేసుకోవాలనే కోరిక ఆలోచన నాకు లేవు. ఏదైనా సామరశ్యపూర్వకంగానే సాధించుకోవాలని నేను కోరుకొంటున్నాను, కానీ తప్పనిసరైతే న్యాయపోరాటానికి వెనుకాడబోము,” అని అన్నారు.