జి.ఎస్.టి.తో సామాన్యులకు ఏదో మేలు జరుగుతుందని ఆశించడం అంటే నేతి బీరకాయలో నెయ్యి ఉందనుకోవడమే అవుతుంది. అనేక నిత్యావసరవస్తువులను జి.ఎస్.టి. నుంచి పూర్తిగా మినహాయించినప్పటికీ, వర్తకులు ప్రజల దగ్గర నుంచి ముక్కు పిండి జి.ఎస్.టి. వసూలు చేస్తూనే ఉన్నారు. ఉదాహరణకు బియ్యం, పాలు తదితర నిత్యావసర వస్తువులను జి.ఎస్.టి. నుంచి మినహాయించారు. కానీ ఆ ప్రయోజనం సామాన్య ప్రజలకు అందడం లేదనే చేదు వాస్తవం అందరికీ తెలిసిందే. ఏమంటే...బ్రాండెడ్ వస్తువులపై జి.ఎస్.టి. ఉంటుందని వర్తకుల నుంచి సమాధానం వస్తుంది. ఇదివరకు కూడా అవే బియ్యం అవే పాలు..అప్పుడు అనేక పన్నులు ఉండేవి. కానీ ఇప్పుడు వాటిపై ఏ పన్ను లేకపోయినా ముద్రించిన ప్యాకెట్లలో అమ్ముతున్నారు గాబట్టి జి.ఎస్.టి. తప్పదట! ఇక హోటల్స్, వివిధ సేవలు అందించే సంస్థలు చేసే జి.ఎస్.టి. మాయాజాలం అంతా ఇంతా కాదు. నగదు చెల్లిస్తే ఒక రకం రేటు, అదే.. క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లిస్తే మరో రకం రేట్లు వసూలు చేస్తుంటారు. కనుక జి.ఎస్.టి. సామాన్య ప్రజలకు అంతుపట్టని ఒక ‘బ్రహ్మ పదార్ధం’గా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు.
ఇంతకీ ఈ సోదంతా ఎందుకంటే, ఈరోజు జరిగిన జి.ఎస్.టి. కౌన్సిల్ సమావేశంలో మరో 53 వస్తువులను జి.ఎస్.టి. పరిధి నుంచి మినహాయించినట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. వాటిలో హస్తకళలకు సంబంధించినవి 29 రకాల వస్తువులున్నాయి. డ్రిప్ ఇరిగేషన్ వస్తువులపై 18 శాతం నుంచి 12 శాతానికి జీఎస్టీని తగ్గించారు. మరికొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై జి.ఎస్.టి.రేటు తగ్గించినట్లు తెలిపారు. ఈ కొత్తరేట్లు జనవరి 25 నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు.
అనేక నిత్యావసర వస్తువులను, సేవలపై జి.ఎస్.టి. తగ్గించి సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న కేంద్రప్రభుత్వం, సామాన్య ప్రజలకు నిత్యావసరమైన పెట్రోల్, డీజిల్ పై మాత్రం జి.ఎస్.టి. తగ్గించడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. కనీసం కొన్సిల్ సమావేశాలలో ఆ ప్రస్తావన చేయడానికి కూడా ఇష్టపడటం లేదంటే దాని చిత్తశుద్ధి అర్ధం చేసుకోవచ్చు.