హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో గురువారం ఇండియా టుడే-ఐసిఎఫ్ఏఐ అధ్వర్యంలో ‘సౌత్ కాంక్లేవ్-2018’ సదస్సు జరిగింది. దానిలో ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్‌దేశాయ్ అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన సమాధానాలకు సదస్సుకు విచ్చేసిన వారందరూ పదేపదే చప్పట్లతో హర్షద్వానాలు తెలియజేశారు.
‘అన్నివిధాల అభివృద్ధి చెందిన హైదరాబాద్ లభించిన కారణంగానే నేడు రాష్ట్రం ఆర్ధికంగా ఇంత బలంగా ఉంది కదా?’ అనే ప్రశ్నకు సమాధానంగా ‘హైదరాబాద్ నిజాం కాలం నాటికే చాలా అభివృద్ధి సాధించింది. హైదరాబాద్ ను కేవలం ఆంధ్రావారే అభివృద్ధి చేశారంటే నేను అంగీకరించను. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అనేకమంది ప్రజలు హైదరాబాద్ ను అభివృద్ధి చేశారు. తెలంగాణా ఏర్పడితే మిగులు రాష్ట్రంగా అవతరిస్తుందని నేను ముందే చెప్పాను. తెలంగాణా ధనిక రాష్ట్రమని రుజువయింది. అందుకే మేము రాష్ట్రంలో ఒకేసారి అనేక అభివృద్ధి పనులను చేపట్టగలుగుతున్నాము.
విద్యుత్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా “మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలలోనే విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించగలిగాము. మళ్ళీ ఎన్నడూ ఇటువంటి సంక్షోభం తలెత్తకుండా 2020 నాటికి 28వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని పనులు చేస్తున్నాము,” అన్నారు.
రైతుల ఆత్మహత్యల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, “అవును ఇది మాకు చాలా బాధ కలిగిస్తోంది. రైతులే కాదు చేనేత కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. వాటిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలను అమలుచేస్తోంది. రేషన్ బియ్యం కోటా పెంచడం, పెన్షన్లను అందించడం, పంటలకు పెట్టుబడిని అందించడం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, కులవృత్తులను ప్రోత్సహించడం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టాము. గొర్రెలు మేకలనుఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొనే స్థాయి నుంచి విదేశాలకు కూడా మాంసం ఎగుమతి చేస్తే స్థాయికి ఎదగడానికి సబ్సీడీ గొర్రెల పధకాన్ని అమలుచేస్తున్నాము, అని చెప్పారు.
“హైదరాబాద్ ను దేశ రెండవ రాజధాని చేయాలనే ప్రతిపాదనపై మీ అభిప్రాయం ఏమిటి” అనే ప్రశ్నకు, “దానిని స్వాగతిస్తాను. దేశప్రజలు హైదరాబాద్ ను రెండవ దేశరాజధాని చేయాలని కోరుకొంటే అది మాకు కూడా చాలా గర్వకారణమే కదా?” అన్నారు.
“ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదన చిత్తశుద్ధితోనే చేశారా లేక రాజకీయ లబ్ది కోసం చేశారా?” అనే ప్రశ్నకు సమాధానంగా, “ముందుగా అది ముస్లింల కోసమే చేసింది కాదు. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల కోసం నిర్దేశించినది. మా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాల ప్రజలందరికీ సమాన అవకాశాలు లభించాలని కోరుకోవడం తప్పు కాదు కదా?కనుక 50 శాతం గరిష్ట పరిమితి అని గిరిగీసుకొని కూర్చోకుండా వివిధ రాష్ట్రాలలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలుచేయడం మంచి పద్ధతి అని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.
“జాతీయ రాజకీయాలలోకి వస్తారా?” అనే ప్రశ్నకు “నాకు నా తెలంగాణా చాలు. దానిని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. ఆ లక్ష్యం నెరవేర్చుకోగలిగితే నా జన్మధన్యం అయినట్లే. తెలంగాణా అభివృద్ధి కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు,” అని అన్నారు.
“చిన్న రాష్ట్రాలే మేలని మీరు భావిస్తున్నారా?” అనే ప్రశ్నకు సమాధానంగా “తెలంగాణా చిన్న రాష్ట్రం కాదు. భౌగోళికంగా చూసినట్లయితే తెలంగాణా రాష్ట్రం పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల కంటే పెద్దది. ఈ మూడున్నరేళ్ళలో మా ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల కారణంగా దేశంలో మిగిలిన రాష్ట్రాల కంటే తెలంగాణా 16 రంగాలలో ముందుంది. దేశంలో తెలంగాణా రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలపడమే మా ప్రభుత్వ లక్ష్యం,” అన్నారు.
“గుజరాత్ మోడల్ కంటే తెలంగాణా మోడల్ అభివృద్ధి ఆదర్శంగా తీసుకోవాలా?” అనే ప్రశ్నకు “యస్! ఏ రాష్ట్రం దేనిలో అభివృద్ధి సాధిస్తే ఆ రంగంలో దానిని మోడల్ గా తీసుకోవడంలో తప్పేముంది? తెలంగాణాలో మేము అద్భుతాలు సృష్టించబోతున్నాము. కావాలనుకొంటే మీ జర్నలిస్టు మిత్రులు అందరూ రావచ్చు. అందరినీ హెలికాఫ్టర్ లో రాష్ట్రమంతా తిప్పి ఎక్కడెక్కడ ఏవిధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయో చూపిస్తాను,” అని అన్నారు.
మన ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలను బలోపేతం చేయగలిగితే దేశం కూడా బలపడుతుంది. రాజకీయ కారణాలతో రాష్ట్రాలను బలహీనపరిస్తే దేశం బలహీనపడుతుందని కేంద్రం గుర్తించాలి. ఈ మూడున్నరేళ్ళలో తెలంగాణా రాష్ట్రం ఆర్ధికంగా మరింత బలపడటం వలన దేశ ఆర్ధికవ్యవస్థ బలోపేతం కావడానికి తోడ్పడిందన్నారు ముఖ్యమంత్రి కెసిఆర్.