మోత్కుపల్లి వ్యాఖ్యలపై నేతల చైన్ రియాక్షన్స్

January 18, 2018


img

టిటిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ‘తెలంగాణాలో తెదేపా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది కనుక దానిని తెరాసలో విలీనం చేసేయాలని’ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, తెదేపా, వామపక్షాల నేతలు ప్రతిస్పందిస్తున్నారు. 

రేవంత్ రెడ్డి స్పందిస్తూ, “మోత్కుపల్లి ఆవిధంగా ఎందుకు అన్నారో తెలియదు కానీ తెలంగాణాలో తెదేపాను చంపేసిన వ్యక్తి కెసిఆరే. అదే తెరాసలోనే తెదేపాను విలీనం చేయాలని మోత్కుపల్లి కోరడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆత్మగౌరవం ఉన్న ఏ తెదేపా నేత, కార్యకర్త తెరాసలో చేరడు. టిటిడిపిలో నేతల మాటలు, ఆలోచనలకు, పార్టీ కార్యకర్తల ఆలోచనలకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. దాదాపు మూడు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు, ఏపిలో తెదేపాలో చేరారు. వారిని తెదేపా అక్కున చేర్చుకొంటున్నప్పుడు, తెలంగాణాలో పార్టీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొంటే తప్పేమిటి? కాంగ్రెస్-తెదేపాలు శత్రువులు అనే పాత సిద్దాంతం పట్టుకొని వ్రేలాడటం కంటే, పార్టీ పరిస్థితి, వాస్తవ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొంటే మంచిది. తెలంగాణాలో తెదేపాను ముంచేస్తున్న తెరాసను నమ్ముకోవడం కంటే కాంగ్రెస్ పార్టీత్ పొత్తులు పెట్టుకొని తన ఉనికిని కాపాడుకోవడం మంచిది కదా!” అన్నారు.

ఏపి సిఎం కుమారుడు, మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, “మోత్కుపల్లి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవిగా భావిస్తాము. పార్టీలో ఉండదలచినవారు పార్టీ నియమావళికి కట్టుబడి ఉండాలి. ఏపిలో కలెక్టర్ల సమావేశంలో ఉన్నందునే  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించలేకపోయారు. కానీ విజయవాడలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు,” అని అన్నారు. 

టిటిడిపి సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందిస్తూ, “మోత్కుపల్లికి చంద్రబాబు నాయుడు ఎంతో గౌరవం, పదవులు ఇచ్చారు. అదే తప్పని మోత్కుపల్లి నిరూపిస్తున్నారిప్పుడు. తెలంగాణాలో తెదేపాను ఏవిధంగా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఆయనకు తెరాసలో చేరాలని అంతగా కోరిక ఉంటే వెళ్ళి చేరవచ్చు కానీ పార్టీని మూసేయమని సలహా ఇవ్వడం చాలా తప్పు. అయన చేస్తున్న ఈ నీచ రాజకీయాలను చూస్తుంటే రాజకీయాలంటేనే చాలా అసహ్యం వేస్తోంది,” అని అన్నారు.

సిపిఐ (ఎమ్మెల్యే) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, “ఇప్పటి వరకు తెరాసను విమర్శిస్తున్న తెదేపా నేతలు ఇప్పుడు హటాత్తుగా అదే తెరాసలో తమ పార్టీని విలీనం చేసేయాలని కోరడం చాలా విచిత్రంగా ఉంది,” అని అన్నారు. 

మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ, “తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి అందరూ కలిసిరావాలని రెండేళ్ళ క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునివ్వగా ఇతర పార్టీలకు చెందిన అనేకమంది నేతలు తెరాసలో చేరారు. కనుక రాష్ట్రాభివృద్ధి కోసం తెదేపాను తెరాసలో విలీనం చేయదలిస్తే మేము స్వాగతిస్తాము,” అని అన్నారు.


Related Post