అవేం మాటలు మోత్కుపల్లి? దయాకర్ రెడ్డి

January 18, 2018


img

తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 22వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వచ్చిన ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తెలంగాణాలో తెదేపా పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని కనుక దానిని తెరాసలో విలీనం చేసేస్తే బాగుంటుందని చేసిన వ్యాఖ్యలపై టిటిడిపి నేతలు స్పందించడం మొదలుపెట్టారు. 

ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, “అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. తెదేపాలో భావప్రకటన స్వేచ్చ ఉంది. అయన చేసిన వ్యాఖ్యలపై పొలిటి బ్యూరో సమావేశంలో చర్చిస్తాము. తెలంగాణా రాష్ట్రంలో తెదేపా కొనసాగుతుందని మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పదేపదే గట్టిగా చెపుతున్నారు. అందుకు అనుగుణంగానే మేము రాష్ట్రంలో పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాము. ఆ ప్రయత్నాలలో భాగంగానే పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు శిక్షణాతరగతులు కూడా నిర్వహిస్తున్నాము. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో అన్ని శాసనసభ, ఎంపి స్థానాలకు పోటీ చేస్తాము. మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలను ఎవరూ సీరియస్ గా తీసుకోనవసరం లేదు,” అని అన్నారు. 

టిటిడిపి సీనియర్ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి మాత్రం మోత్కుపల్లిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయనకు పార్టీలో సముచిత గౌరవం, పదవులు ఇస్తే అందుకు ప్రతిగా అయన ఈవిధంగా మాట్లాడటం సరికాదన్నారు. మోత్కుపల్లి ఆ మాటలు అంటున్న సమయంలో తాను పక్కన ఉండి ఉంటే వెంటనే వారించి ఖండించి ఉండేవాడినని అన్నారు. పార్టీలు మారే గుణం ఉన్న నేతలకు పార్టీలో కీలక పదవులు ఇవ్వడమే తప్పని అన్నారు. తెదేపా ఎన్నడూ నేతల మీద ఆధారపడకుండా కార్యకర్తల బలంతోనే నడుస్తోందని కనుక కొంత మంది నేతలు పార్టీ విడిచి వెళ్ళిపోయినా పార్టీ చెక్కు చెదరలేదని దయాకర్ రెడ్డి అన్నారు. 

పార్టీని కాపాడుకోవడానికి తాను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎవరూ తనకు సహకరించడం లేదని మోత్కుపల్లి నరసింహులు అనడం గమనిస్తే అయన మెల్లగా పార్టీకి దూరంగా జరుగదలుచుకొన్నట్లు చెప్పినట్లే భావించవచ్చు. అయన మాటలను టిటిడిపి నేతలు ఖండించారు కనుక ఆయన కోరుకొన్నట్లే వారికీ, ఆయనకు మద్య దూరం పెరగడం మొదలైంది. దానిని ఇంకా పెంచేందుకు నేడోరేపో మోత్కుపల్లి దయాకర్ రావు లేదో మరొకరిపై తీవ్ర విమర్శలు చేసినట్లయితే, ‘పార్టీకి గుడ్ బై చెప్పే తంతు’ మొదలైపోయినట్లే భావించవచ్చు.   


Related Post