చంద్రబాబుకు మోత్కుపల్లి షాక్!

January 18, 2018


img

టిటిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పెద్ద షాక్ ఇచ్చారు. తెరాసతో పొత్తులు పెట్టుకోవాలని కొత్తపాట మొదలుపెట్టిన అయన ఇప్పుడు ఏకంగా తెదేపాను తెరాసలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.

“తెలంగాణాలో తెదేపా పరిస్థితి ఏమీ బాగోలేదని అందరికీ తెలుసు. కనుక చంద్రబాబుకు నా సలహా ఏమిటంటే, రాష్ట్రంలో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్న అప్రదిష్టకంటే తెరాసలో విలీనం చేసేస్తే అందరికీ గౌరవప్రదంగా ఉంటుంది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చూస్తున్న టిటిడిపి నేతలందరూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నాము. దీనికి ఏకైక పరిష్కారం తెదేపాను తెరాసలో విలీనం చేయడమేనని భావిస్తున్నాను. అప్పుడే ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తుంది,” అని అన్నారు.

తెలంగాణాలో తెదేపా పరిస్థితి బాగోలేదని, దాని భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అయన ఒక్కరే పార్టీ ఉనికిని గట్టిగా చాటుతుండేవారు. అయన వెళ్ళిపోయినా పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని, తన వంటి హేమాహేమీలు పార్టీలో చాలామంది ఉన్నారని అందరం కలిసి పార్టీని బలోపేతం చేసుకొంటామని మోత్కుపల్లి నరసింహులు స్వయంగా అప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడుతున్నారు. అంటే ఇంతకాలం రేవంత్ రెడ్డి కారణంగానే రాష్ట్రంలో తెదేపా నిలబడి ఉందని, అయన వెళ్ళిపోవడంతో ఇంకా బలహీనపడిందని మోత్కుపల్లి అంగీకరించినట్లు అర్ధమవుతోంది. 

తనకెంతో రాజకీయ అనుభవం ఉందని గొప్పలు చెప్పుకొన్న మోత్కుపల్లి, పార్టీని కాపాడుకొని బలోపేతం చేసుకోవడానికి చిన్న ప్రయత్నం కూడా చేయకుండా పార్టీని తెరాసలో విలీనం చేయమని చంద్రబాబుకు ఉచిత సలహా ఇవ్వడం సిగ్గుచేటు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీల బలాబలాలు, తెదేపా భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో కేవలం పొత్తులు పెట్టుకొందామని సూచిస్తే మోత్కుపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని గట్టిగా వాదించారు. కానీ ఇప్పుడు తెదేపాను తెరాసలో విలీనం చేస్తే ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉంది. 

మోత్కుపల్లికి తన రాజకీయ భవిష్యత్ ముఖ్యమనుకొంటే తెదేపాకు గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరిపోవచ్చు కానీ తన స్వీయప్రయోజనాల కోసం పార్టీని తెరాసలో విలీనం చేసేయాలని సూచించడం దారుణం. పార్టీలో సీనియర్ నేత అయిన మోత్కుపల్లి అన్న ఈ మాటలు పార్టీ శ్రేణుల ఆత్మస్థయిర్యాన్ని ఇంకా దెబ్బతీసేవిగా ఉన్నాయి. ఒకవేళ మోత్కుపల్లి బాబు మనసులో మాటలనే పలుకుతున్నట్లయితే, వాటిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ బలపరుస్తారు లేకుంటే ఖండిస్తారు. కనుక మోత్కుపల్లి మొదలుపెట్టిన ఈ చర్చ ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.


Related Post