ప్రొఫెసర్ గారు అగమ్యగోచరంగా ముందుకు సాగుతున్నారా?

January 17, 2018


img

ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్షాలు ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ విమర్శిస్తుండటం సహజమే. అయితే తెలంగాణా రాష్ట్రంలో ప్రతిపక్షాలతో బాటు టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ఆయన కూడా ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తుండటం విశేషం. అయితే అయన విమర్శలను ఆరోపణలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కనుక అయన ఏవిధంగా తన ఆశయాలను, లక్ష్యాలను నెరవేర్చదలచుకొన్నారో స్పష్టత ఈయకుండా ప్రతిపక్షాలతో పోటీపడుతూ స్పూర్తియాత్రలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికే పరిమితం అవుతున్నారు.

వాటితో ప్రజలలో చైతన్యం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు అయన చెప్పుకొంటున్నారు. అయితే తెలంగాణా ప్రజలు ఎప్పుడూ చైతన్యంగానే ఉంటారని పలు సందర్భాలలో నిరూపించి చూపారు. తెరాస సర్కార్ పాలన, తీరు, అది చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలనే కాకుండా, ప్రతిపక్షాలు ఎత్తి చూపుతున్న లోపాలను, అవినీతి ఆరోపణలను అన్నిటినీ కూడా రాష్ట్ర ప్రజలు నిశితంగానే గమనిస్తునే ఉన్నారు. కనుక ప్రొఫెసర్ కోదండరాం మళ్ళీ కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదనే చెప్పవచ్చు. 

తెరాస సర్కార్ మంచో చెడో తను ఎంచుకొన్న మార్గంలో ముందుకు సాగుతోంది కానీ ప్రొఫెసర్ కోదండరాం మాత్రం అగమ్యంగా సాగుతున్నట్లున్నారు. అయన ఏదైనా ఒక రాజకీయ పార్టీలో చేరడమో లేక తనే స్వయంగా ఒక పార్టీని స్థాపించడమో చేస్తే అప్పుడు అయన మాటలకు, చర్యలకు ఒక నిర్దిష్ట లక్ష్యం, ప్రయోజనం ఏర్పడుతుంది. అప్పుడు ప్రజలకు కూడా అయన పట్ల నమ్మకం ఏర్పడుతుంది. కానీ అటువంటి ప్రయత్నమేదీ చేయకుండా సభలు సమావేశాలు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటం వలన ప్రజలలో పలచనయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే అయన ‘కాంగ్రెస్ ఏజంటు’ అని తెరాస చేస్తున్న విమర్శలను భరించవలసివస్తోంది. 

ఈరోజు అయన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం కోనాపూర్ లో తెలంగాణా అమరవీరుల ఆత్మగౌరవసభలో ప్రసంగిస్తూ దేశంలో సచివాలయానికి రాకుండా పాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని, అయన పేరు గిన్నిస్ బుక్ లో చేర్చాలని ఎద్దేవా చేశారు. 

మొదట్లో నిర్మాణాత్మకమైన విమర్శలు చేసిన ప్రొఫెసర్ కోదండరాం ఇప్పుడు ఇటువంటి విమర్శలతో ఏమి సాధించాలని భావిస్తున్నట్లు? అనే అనుమానం కలుగకమానదు. కెసిఆర్ ఏ కారణం చేత సచివాలయానికి రాకపోయినా కేంద్రప్రభుత్వంతో సహా దేశంలో అనేక రాష్ట్రాలు అయన పాలనను మెచ్చుకొంటున్నాయి. రాష్ట్రానికి నిత్యం ఏదో ఒక రంగంలో అవార్డులు లభిస్తూనే ఉన్నాయి. అంటే ప్రొఫెసర్ కోదండరాం విమర్శ అర్ధరహితంగా ఉందని అర్ధమవుతోంది. కనుక ప్రొఫెసర్ కోదండరాం ముందుగా తను ఏ మార్గంలో ప్రయాణించాలో నిర్ణయించుకొంటే మంచిదేమో? 


Related Post