కమెడీయన్ విలన్ అయ్యేడేమిటి?

January 17, 2018


img

ఒకప్పుడు బాబుమోహన్ సినిమాలలో చేసే చిలిపి చేష్టలతో ప్రేక్షకులు పకపకానవ్వుకొనేవారు. కానీ అయన రాజకీయాలలోకి వచ్చి తెరాస ఎమ్మెల్యే అయిన తరువాత, తన నియోజకవర్గం ప్రజల పాలిట విలన్ గా మారాడని అందరూ అనుకొంటున్నారు. అనుకోవడమే కాదు...ఆయన తీరును నిరసిస్తూ ఈరోజు ఆందోల్-జోగిపేట నగర పంచాయితీ పాలకవర్గ సభ్యులు చైర్ పర్సన్ కవిత సురేందర్ గౌడ్ నేతృత్వంలో ఒక ర్యాలీ నిర్వహించారు కూడా. ఆందోల్-జోగిపేట నగర పంచాయితీలో సరిపడినన్ని నిధులు ఉన్నప్పటికీ బాబు మోహన్ మొండి వైఖరి కారణంగా గత ఐదేళ్ళుగా ఎటువంటి అభివృద్ధి పనులను చేపట్టలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం పంచాయితీ ఖాతాలో రూ.7 కోట్లు నిధులున్నాయని, కానీ అభివృద్ధి పనులకు టెండర్లను పిలువబోతే బాబు మోహన్ అందరినీ బెదిరించి అడ్డుకొంటున్నారని చైర్ పర్సన్ కవిత సురేందర్ గౌడ్ మీడియా ప్రతినిధులకు తెలిపారు. అయినప్పటికీ ఆయనకు నచ్చజెప్పి పనులను ప్రారంభించడానికి తాము శతవిధాలా ప్రయత్నించామని కానీ అయన ఏదో సాకు చూపి పనులు మొదలుపెట్టకుండా అడ్డుపడుతున్నారని, అధికారులను కూడా బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

బాబు మోహన్ విచిత్ర వైఖరి కారణంగా ఆందోల్-జోగిపేట నగర పంచాయితీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆమె చెప్పారు. ఆయనకు తమ నిరసన తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే ఈరోజు ఈ నిరసన ర్యాలీ చేపట్టవలసి వచ్చిందని ఆమె చెప్పారు. ఇకనైనా అయన తన తీరు మార్చుకోకపోతే జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్ కు పిర్యాదు చేస్తామని హెచ్చరించారు. 

బాబు మోహన్-మున్సిపల్ కార్యవర్గ సభ్యుల మద్య జరుగుతున్న ఆధిపత్యపోరులో భాగంగా దీనిని చూడాలా లేక బాబు మోహన్ నిజంగానే అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారా? అనేది మెల్లగా బయటపడుతుంది కానీ పరిస్థితి ఇంతదాక వచ్చే వరకు జిల్లా కలెక్టర్, జిల్లా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ మంత్రి ఎవరూ జోక్యం చేసుకోకపోవడమే విచిత్రంగా ఉంది. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే అజెండాగా పెట్టుకొని ప్రభుత్వం పనిచేస్తుంటే అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే అభివృద్ధికి అడ్డుపడుతుండటం నిజమైతే ముఖ్యమంత్రి కెసిఆర్ కలుగజేసుకోవడం మంచిది లేకుంటే అక్కడ జరుగుతున్న ఇటువంటి పరిణామాలవలన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. 


Related Post