కమల్ హాసన్ పార్టీకి ముహూర్తం ఖరారు

January 17, 2018


img

తమిళనాడులో ఒకేసారి మూడు కొత్తపార్టీలు పుట్టుకువస్తున్నాయి. వాటిలో రెండు ప్రముఖ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ లవి కాగా మూడోది శశికళ మేనల్లుడు దినకరన్ ది. 

కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ కలిసి అనేక సినిమాలలో నటించారు. ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశిస్తామని ప్రకటించారు. ఇద్దరి లక్ష్యాలు కూడా ఒక్కటే. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించి, స్థిరమైన, నీతివంతమైన ప్రభుత్వాన్ని అందించడమేనని చెప్పుకొంటున్నారు. కానీ ఇద్దరూ వేర్వేరుగా పార్టీలు పెట్టుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఇద్దరిలో ముందుగా కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం గురించి ప్రకటన చేసినప్పటికీ, పార్టీని ఏర్పాటు చేయడానికి కొంత సమయం అవసరమని వెనక్కు తగ్గారు. అదే సమయంలో రజనీకాంత్ రాజకీయ ప్రకటన చేశారు. కానీ అయన కూడా పార్టీని ఏర్పాటు చేయడానికి కొంత సమయం అవసరమని వెనక్కు తగ్గారు. వచ్చే ఎన్నికలలో తమ పార్టీ రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తుందని ప్రకటించారు. ఈలోగా పార్టీ నిర్మాణం చేసుకొంటానని తెలిపారు. 

రజనీకాంత్ కాస్త వెనక్కు తగ్గగానే కమల్ హాసన్ మళ్ళీ ముందుకు వచ్చి ఫిబ్రవరి 21వ తేదీన తన స్వస్థలం రామనాథపురంలో తన పార్టీ పేరును, జెండా, అజెండాలను ప్రకటిస్తానని ఈరోజు మీడియాకు తెలిపారు. ఆరోజు నుంచే తమిళనాడులో మధురై, దిండిగల్, శివగంగ జిల్లాలలో పర్యటిస్తానని తెలిపారు. దశలవారిగా రాష్ట్రమంతటా పర్యటించి రాష్ట్ర ప్రజల సమస్యలు, వారి అవసరాలు, అభిలాషల గురించి తెలుసుకొంటానని కమల్ హాసన్ చెప్పారు. 

కమల్, రజనీ ఇద్దరూ తమిళ సినీపరిశ్రమను శాశిస్తున్నవారే కనుక సినీ పరిశ్రమ వారిద్దరి మద్య చీలిపోవడం ఖాయమే. అప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమిళనాడులో ‘స్టార్ వార్స్’ తప్పకపోవచ్చు. ఇక దినకరన్ కూడా నేడోరేపో కొత్త పార్టీని స్థాపించడానికి సన్నాహాలు చేసుకొంటున్నాడు. కనుక అన్నాడిఎంకె, డిఎంకె, దినకరన్ పార్టీల మద్య పొలిటికల్ వార్స్ కూడా అనివార్యంగానే కనిపిస్తున్నాయి. ఇవికాక కాంగ్రెస్, భాజపాలతో సహా రాష్ట్రంలో మరో డజనుకు పైగా పార్టీలున్నాయి. వాటన్నిటి మద్య ప్రజల ఓట్లు చీలిపోతే, తమిళనాడులో ఇంకా రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినా ఆశ్చర్యం లేదు. 


Related Post