భాజపాలో మరో వికెట్ డౌన్?

January 17, 2018


img

తెలంగాణాలో భాజపా నేతలు ఒకరొకరే పార్టీకి గుడ్ బై చెప్పేసి ఇతర పార్టీలలోకి వెళ్ళిపోతున్నారు. కొన్ని రోజుల క్రితమే పార్టీలో సీనియర్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరిపోయారు. తరువాత నల్లగొండజిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు పార్టీకి గుడ్ బై చెప్పేసి గులాబీ కారెక్కడానికి సిద్దం అవుతున్నారు. ఇదివరకు అయన ప్రాతినిధ్యం వహించిన తుంగతుర్తి నియోజకవర్గంలో అయన అనుచరులు, సర్పంచ్ లు, ఎంపిటిసిలు చాలా రోజుల క్రితమే కారెక్కేశారు. కనుక సంకినేని కూడా ఇక ఆలస్యం చేయకపోవచ్చు. వచ్చే ఎన్నికలలో తనకు కోదాడ నుంచి శాసనసభ టికెట్ కావాలని అయన కోరుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తెరాస అధిష్టానం అందుకు అంగీకరిస్తే అయన కారెక్కడం ఖాయమే. ఆయన ఈ నెల 28వ తేదీకి ముహుర్తం కూడా నిర్ణయించుకొన్నట్లు తాజా సమాచారం. 

ఇక నాగం జనార్ధన్ రెడ్డి కూడా తాను ఉగాది పండుగ తరువాత పార్టీ మారబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్రంలో భాజపాయే అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్ర భాజపాలో చేరేందుకు ఎవరూ ముందుకు రాకపోగా  పార్టీలో ఉన్నవారే బయటకు వెళ్ళిపోతుండటం ఆశ్చర్యకరం. తెరాసతో పొత్తుల విషయంలో పార్టీలో నెలకొన్న అయోమయమే ఇందుకు కారణమని నాగం జనార్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెరాసతో పొత్తుల కోసం ఆశపడుతూ చేతులు ముడుచుకొని కూర్చోనందున రాష్ట్రంలో పార్టీ క్రమంగా తన ఉనికిని కోల్పోతోందని నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. కనుక భాజపా అధిష్టానం ఇప్పటికైనా రాష్ట్ర భాజపాకు సరైన దిశానిర్దేశం చేసి అది కూడా అందుకు అనుగుణంగా వ్యవహరించవలసి ఉంది.


Related Post