డబ్బు సిద్దంగా ఉంచండి మహాప్రభో!

January 17, 2018


img

ఈ ఏడాది మే నెల నుంచి రాష్ట్రంలో రైతులందరికీ ఎకరానికి రూ.4,000 చొప్పున పంట పెట్టుబడిని చెక్కుల ద్వారా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొన్న సంగతి తెలిసిందే. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.6,000 కోట్లు విలువగల చెక్కులు పంపిణీ చేయడానికి సిద్దం అవుతోంది. అంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ నోట్ల కొరత మొదలైంది. చాలా బ్యాంకుల ఎటిఎంలు మూసి ఉంటున్నాయి తెరిచి ఉన్నవాటిలో నగదు ఉండటం లేదు. బ్యాంకులకు వెళ్ళినా ఒక పరిమితికి మించి నగదు లభించడం లేదు. ఈ నేపధ్యంలో ఒకేసారి రైతులు అందరూ తమకు అందిన చెక్కులను బ్యాంకులలో జమా చేస్తే రూ.6,000 కోట్లు నగదు వారికి అందించవలసి ఉంటుంది. అది కాక రోజువారి లావాదేవీలకు కనీసం మరో రూ.1-2,000 కోట్లు నగదు నిలువలు అవసరం ఉంటుంది. ఈ సమస్యను ముందే గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ లను డిల్లీ పంపించింది. వారు కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి ప్రభుత్వం ప్రారంభించబోతున్న ఈ పధకం గురించి వివరించి, ఆ సమయానికి రాష్ట్రంలో అన్ని బ్యాంకులలో తగినంత నగదు నిలువలు అందుబాటులో ఉంచాలని కోరారు. 

ఈ పధకం కోసం నిధులు కేటాయించమని రాష్ట్ర ప్రభుత్వం అడగటం లేదు. అది రైతులకు చెక్కుల రూపంలో అందించబోతున్న ఆర్దికసహాయాన్ని నగదుగా మార్చుకోవడానికి బ్యాంకులలో తగినంత నగదును అందుబాటులో ఉంచమని మాత్రమే కోరుతోంది. అయితే సాధారణ పరిస్థితులలోనే ప్రజలకు అవసరమైన నగదును అందించలేకపోతున్న కేంద్రప్రభుత్వం, ఒకే నెలలో అధనంగా రూ.6,000 కోట్లు అందించగలదా? అనే అనుమానం కలుగుతోంది. 


Related Post