రాష్ట్రంలో నియంతృత్వపాలన: ఉత్తమ్ కుమార్ రెడ్డి

January 16, 2018


img

ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న ఎం.ఆర్.పి.ఎస్.నాయకుడు మందకృష్ణ మాదిగను వరుసగా రెండవసారి అరెస్ట్ చేసి జైల్లో నిర్బందించిన సంగతి తెలిసిందే. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరికొందరు కాంగ్రెస్ నేతలతో కలిసి బుధవారం చంచల్ గూడ జైలుకు వెళ్ళి ఆయనను పరామర్శించి వచ్చారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలో ఇచ్చిన హామీని అమలుచేయమని కోరినందుకు మందకృష్ణ మాదిగను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం చాలా అన్యాయం. దారుణం. రాష్ట్రంలో దళితులు, బలహీనవర్గాల పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా  చిన్నచూపు ఉందని నిరూపించేందుకు ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. నేరెళ్ళలో దళితులపై దాడులు, ఖమ్మంలో మిర్చి రైతులకు సంకెళ్ళు వంటివన్నీ కూడా అదే సూచిస్తున్నాయి. రాష్ట్రంలో నియంతృత్వ, నిరంకుశపాలన సాగుతోంది. రాష్ట్రంలో అణగారినవర్గాలపై యదేచ్చగా దాడులు జరుగుతున్నాయి. ప్రశ్నించినవారికి ఈవిధంగా జైలుకు పంపించడం లేకుంటే పోలీసుల చేత వేధించడం ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారిపోయింది. ఎస్సీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు తీసుకువెళతానని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్, మందకృష్ణ మాదిగను ఎందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారు? ఆయనను తక్షణమే జైలు నుంచి విడిచిపెట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 

మందకృష్ణ మాదిగను శాంతిభద్రతల కారణం చూపి అరెస్ట్ చేసి జైలుకు పంపించడం ప్రభుత్వానికి పెద్ద కష్టమైన పనేమీ కాదు. అయన చెపుతున్న సమస్యలను తీర్చలేకపోయినా ప్రభుత్వానికి ఏమీ నష్టం జరుగదు కానీ రాష్ట్రంలో ఒక బలమైన వర్గానికి నాయకుడైన ఆయనను ఈవిధంగా పదేపదే జైలులో నిర్బందించడం వలన ఆ వర్గానికి ప్రజలను తెరాస చేజేతులా దూరం చేసుకొన్నట్లవుతోందని చెప్పక తప్పదు. వచ్చే ఎన్నికలలో దీని ప్రభావం తప్పకుండా ఎదుర్కోవలసి రావచ్చు. కాంగ్రెస్ నేతలు ఇది గ్రహించినందునే ఆ వర్గం ప్రజలను తమ పార్టీ వైపు ఆకర్షించేందుకే జైల్లో ఉన్న ఆయనను పరామర్శించి, అయన పోరాటానికి సంఘీభావం తెలిపారని వేరే చెప్పనవసరం లేదు. 


Related Post