తమిళ రాజకీయాలలో మరో కొత్త ట్విస్ట్

January 16, 2018


img

తమిళనాడు రాజకీయాలలో మళ్ళీ మరో కొత్త ట్విస్ట్ రాబోతోంది. అన్నాడిఎంకె పార్టీని, దాని ఎన్నికల చిహ్నాన్ని స్వంతం చేసుకోవడానికి విఫల ప్రయత్నాలు చేసిన శశికళ మేనల్లుడు దినకరన్ త్వరలో కొత్త పార్టీని పెట్టాలని నిశ్చయించుకొన్నాడు. 

అన్నాడిఎంకె వ్యవస్థాపకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిస్వర్గీయ ఎంజి రామచంద్రన్ జయంతి రేపు (బుధవారం). రేపు చెన్నైలోని ఆయన సమాధివద్ద కొత్తపార్టీ స్తాపిస్తున్నట్లు ప్రకటించబోతున్నట్లు తాజా సమాచారం. ఇటీవల ఆర్.కె.నగర్ ఉపఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచిన తరువాత దినకరన్ లో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. ఉపఎన్నికలలో గెలిచిన వెంటనే, ప్రస్తుతం అధికారంలో ఉన్న పళని-పన్నీరు సర్కార్ మూడు నెలలలోగా కూలిపోవడం ఖాయం అని దినకరన్ ప్రకటించారు. కొత్తపార్టీని ప్రారంభించిన వెంటనే అధికార అన్నాడిఎంకెకు చెందిన 20-25 మంది ఎమ్మెల్యేలు దానిలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవే నిజమైతే, త్వరలోనే మళ్ళీ తమిళనాడులో మరోసారి రాజకీయ సంక్షోభం ఏర్పడటం ఖాయం. 

అన్నాడిఎంకెలో కొనసాగుతున్న ఈ విపరీత అనూహ్య రాజకీయ పరిణామాల పట్ల ఆగ్రహంగా ఉన్న తమిళ ప్రజలు  కొత్తగా పార్టీ పెట్టబోతున్న రజనీకాంత్ వైపు మొగ్గుచూపినా ఆశ్చర్యం లేదు. కనుక రజనీకాంత్ వీలైనంత వేగంగా తన పార్టీని ఏర్పాటు చేసుకోవడం మంచిది. 


Related Post