సుప్రీం సమస్యలు పరిష్కారం అయ్యాయిట!

January 15, 2018


img

సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు మద్య తలెత్తిన వివాదాలు అన్నీ పరిష్కారం అయ్యాయని భారత అటార్నీ జనరల్ (ఎజిఐ) కెకె వేణుగోపాల్ మీడియా ప్రతినిధులకు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తిపై తిరుగుబాటు చేసిన జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసఫ్‌ లపై ఎటువంటి చర్యలు తీసుకోబడవని, వారు నలుగురు మళ్ళీ యధాప్రకారం విధులు నిర్వర్తిస్తున్నారని వేణుగోపాల్ తెలిపారు. 

ఆయనతోబాటు మీడియా సమావేశంలో పాల్గొన్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మానన్ మిశ్రా కూడా ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోయిందని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టులో పనిచేస్తున్న 15 న్యాయమూర్తులు సమావేశమయ్యి, ఆ నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలపై చర్చించి తగిన సూచనలు చేశారని, వాటికి అందరూ ఆమోదం తెలుపడంతో ఈ వివాదం ముగిసిందని చెప్పారు. సుప్రీం కోర్టులో తలెత్తిన ఈ సమస్య సుప్రీంకోర్టు అంతర్గత సమస్య కనుక దీనిలో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని అన్నారు.

ఆ నలుగురు న్యాయమూర్తులు మీడియా సమావేశంలో అనేక సమస్యలను ప్రస్తావించారు. వాటి పరిష్కారం కోసం తాము ఎంతగా ప్రయత్నించినా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా పట్టించుకోలేదని ఆరోపించారు. అందుకే మీడియా ద్వారా వాటిని ప్రజల దృష్టికి తీసుకువస్తున్నామని చెప్పారు. 

అటువంటి క్లిష్ట సమస్యలన్నీ ఒకే ఒక సమావేశంతోనే పరిష్కారం అయిపోయాయని ఎజిఐ కెకె వేణుగోపాల్, మానన్ మిశ్రా చెపుతున్న మాటలు నమ్మశక్యంగా లేవు. ఈ సమస్యను అంత సులువుగా పరిష్కరించే అవకాశమే ఉంటే, న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తిపై తిరుగుబాటు చేయడం ఎందుకు? ఇదే పని మొదటే చేస్తే ఇంత అప్రదిష్ట ఉండదు కదా? 

అనేక జటిలమైన వివాదాలను పరిష్కరించే న్యాయమూర్తులే తమ సమస్యలను దేశప్రజలకు మోరపెట్టుకోవడం విచిత్రమే. వారంతటవారే ప్రజల ముందుకు వచ్చి తమ విభేదాలను బయటపెట్టుకొన్నారు కనుకనే రాజకీయపార్టీలు దానిలో వేలుపెట్టే ప్రయత్నం చేశాయి. కనుక తమ అంతర్గత వ్యవహారాలలో రాజకీయపార్టీలు జోక్యం చేసుకొంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేయడం సబబు కాదు. 

ఎజిఐ కెకె వేణుగోపాల్ చెపుతున్నట్లు ఈ సమస్య ఇంతటితో ముగిసిపోయుంటే చాలా సంతోషమే కానీ లోలోనరగులుతుంటే దానివలన న్యాయవ్యవస్థకు చాలా నష్టం జరగడం ఖాయం. ఏది ఏమైనప్పటికీ, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ప్రధానన్యాయమూర్తిపై ఈవిధంగా తిరుగుబాటు చేయడం వలన సర్వోన్నత న్యాయస్థానం ప్రతిష్ట మసకబారిందని చెప్పక తప్పదు. కనుక ఇకనైనా మళ్ళీ ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా అందరూ జాగ్రత్తపడితే మంచిది.


Related Post