ఒక్క పార్టీ చేయలేనిది...అన్నీ కలిసి చేయగలవా?

January 15, 2018


img

తెలంగాణాలో 28 చిన్న చిన్న పార్టీలన్నీ సిపిఎం నేతృత్వంలో ‘బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్’ (బిఎల్ఎఫ్) అనే కూటమిని ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నెల 25వ తేదీన వనస్థలిపురంలో దాని ఆవిర్భావసభ జరుగబోతోంది. ఆదివారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో దాని పోస్టర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. దానికి హాజరైన కూటమి నేతలు మాట్లాడుతూ కెసిఆర్ మాటలకు చేతలకు చాలా తేడా కనిపిస్తోందన్నారు. అయన మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేసేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, తెదేపా, తెరాస, భాజపాలన్నీ ఒక తానులో ముక్కలేనని, అవేవీ ప్రజా సమస్యలను పరిష్కరించలేకపోయాయని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడిదారుల, అగ్రవర్ణాల ఆధిపత్యపాలన సాగుతోందని, దాని స్థానంలో మరే పార్టీ వచ్చినా కూడా పరిస్థితులలో ఎటువంటి మార్పు కూడా రాదని కనుక, వాటన్నిటికీ ఏకైక ప్రత్యామ్నాయంగా బిఎల్ఎఫ్ ఆవిర్భావిస్తోందన్నారు. ప్రస్తుతం ఉన్న అగ్రకుల, పెట్టుబడిదారుల ప్రభుత్వాన్ని తొలగించి దాని స్థానంలో సామాజికన్యాయం చేయగల బిఎల్ఎఫ్ అధికారంలోకి రావలసిన అవసరం ఉందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నల్లా సూర్యప్రకాష్ రావు(బహుజన రాజ్యాధికారపార్టీ), జానకి రాములు(ఆర్.ఎస్.పి), ఖాన్ సహ్బాజ్ ఖాన్(ఎం.బి.టి), రామ నర్సయ్య(సోషల్ జస్టిస్ పార్టీ), ఎం.అశోక్ (ఎం.సి.పి.ఐ-యు), పిఎల్ విశ్వేశ్వర రావు (ఆప్) తదితరులు పాల్గొన్నారు. 

ఈ కూటమిలో భాస్వాములలో చాలామంది మేధావులే కనుక వివిధ పార్టీల పాలనావిధానాలు, వివిధ అంశాలు, ప్రజాసమస్యలపై అందరూ చాలా గొప్పగానే మాట్లాడారు. అయితే రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొని ఉందనే ఆలోచనతో, అధికారం చేజిక్కించుకోవడానికి ఇదే అదునుగా భావించినందునే వారు ఈ కూటమిని ఏర్పాటు చేసుకొంటున్నారనేది అందరికీ తెలిసిన రహస్యం. బలమైన, సమర్ధమైన నాయకత్వం కలిగిన కాంగ్రెస్, తెరాస, తెదేపా, భాజపాలు చేయలేని పనులను, రాజ్యాధికార కాంక్షతో చేతులు కలుపుతున్న 28 పార్టీలు చేయగలవా? అంటే అనుమానమే. 

గతంలో మనదేశంలో ఇటువంటి ‘థర్డ్ ఫ్రంట్’ ప్రయోగాలు కొన్నిసార్లు జరిగాయి కానీ ఏవీ ఫలించలేదు. కనుక ఎన్నికలకు ముందు పుట్టుకొచ్చే ‘థర్డ్ ఫ్రంట్’ లు ఎన్నికల తరువాత కనుమరుగు అవుతుంటాయి. బహుశః బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ విషయంలో కూడా అదే జరుగవచ్చు.


Related Post