కాంగ్రెస్ నేతలు చెప్పిందే జరుగబోతోందా?

January 13, 2018


img

రైతులకు నిరంతర ఉచిత విద్యుత్ పంపిణీ అంశంపై కాంగ్రెస్ నేతల వాదనే సరైనదా? దానినే తెరాస సర్కార్ అమలుచేయడానికి సిద్దం అవుతోందా? అంటే సాగునీటిశాఖ మంత్రి హరీష్ రావు ఇవ్వాళ్ళ చెప్పిన మాటలు వింటే అవుననే అనుకోవలసి ఉంటుంది. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ ఆలీ, రేవంత్ రెడ్డి ఇంకా పలువురు కాంగ్రెస్ నేతలు రైతులకు నిరంతర ఉచిత విద్యుత్ పంపిణీ చేయడం వలన లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని గట్టిగా వాదించారు. 24 గంటలు ఉచిత విద్యుత్ అందించడం వలన రైతులు అవసరం కంటే ఎక్కువగా బోరుబావులు, కాలువల నుంచి నీళ్ళను తోడుకోవడం మొదలుపెడతారని, దాని వలన భూగర్భజలాలు తగ్గిపోవడం, కాలువ చివరన ఉన్న పొలాలకు నీళ్ళు అందకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని వాదించారు. అలాగే ఉచిత విద్యుత్ పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్ధికభారం పడుతుందని అన్నారు. కనుక పగలు 9గంటలసేపు నిరంతరంగా ఉచిత విద్యుత్ అందించగలిగితే సరిపోతుందని వారు వాదించారు. అయితే వారి వాదనలను తెరాస నేతలు తేలికగా కొట్టిపడేశారు. కానీ కొన్ని రోజుల క్రితం ‘నమస్తే తెలంగాణా’ లో ప్రసారమయిన ఒక కధనంలో ఆ అనుమానాలే నిజమవుతున్నాయని స్పష్టం చేసింది. కాలువలలో ఎన్ని నీళ్ళు విడుదలచేసినప్పటికీ కాలువ చివరన ఉండే భూములకు తగినన్ని నీళ్ళు అందడం లేదని, ఉచిత విద్యుత్ లభిస్తున్న కారణంగా రైతులు కాలువ పొడవునా ఎక్కడికకక్కడ పంపులు ఏర్పాటు చేసుకొని అవసరానికి మించి నీళ్ళు తోడేసుకోవడమే అందుకు కారణమని పేర్కొంది. 

మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్ రావు శనివారం పర్వతగిరి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గ్రామస్తులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “సాగుకు 24 గంటలు ఉచిత విద్యుత్ కావాలా వద్దా అనేది రైతులు నిర్ణయించుకొని చెపితే దానిని మేము అమలుచేస్తాము. 24 గంటలు విద్యుత్ సరఫరా అవసరం లేదనుకొన్నవారు తమకు ఎన్ని గంటలు ఉచిత విద్యుత్ కావాలో గ్రామసభలలో తీర్మానాలు చేసుకొని వాటిని స్థానిక ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వానికి పంపిస్తే రైతులకు సరిపడా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తాము,” అని అన్నారు. 

రైతులకు నిరంతర ఉచిత విద్యుత్ పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టి నేటికి సరిగ్గా 13 రోజులు మాత్రమే అయ్యింది. ఇంకా రెండువారాలు పూర్తికాకముందే 24 గంటలు ఉచిత విద్యుత్ పై ప్రభుత్వం ఆలోచనలోపడటం గమనిస్తే ఈవిషయంలో కాంగ్రెస్ నేతల వాదనలు సరైనవేనని అర్ధం అవుతోంది. రాబోయేది వేసవి కాలం కనుక ఈ విద్యుత్ వినియోగం..ఆ కారణంగా ప్రభుత్వంపై ఆర్ధికభారం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు. కనుక ఇప్పుడు రైతులను అభ్యర్ధిస్తున్న ప్రభుత్వం మున్ముందు ఈ పధకాన్ని పగటిపూటకే పరిమితం చేసినా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ నేతలు చెపుతున్నది అదే! 


Related Post