తెరాస నేతలకు కెసిఆర్ మొట్టికాయలు వేశారా?

January 13, 2018


img

విద్యుత్ కొనుగోళ్ళు వ్యవహారంలో కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు బదులిస్తూ కాంగ్రెస్ నేతలను బహిరంగ చర్చకు రావాలని తెరాస ఎంపి బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, భాను ప్రసాద్ లు సవాలు విసిరారు. దానికి రేవంత్ రెడ్డి ‘సై’ అన్నారు. అనడమే కాదు శుక్రవారం అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి తెరాస నేతల కోసం చాలాసేపు వేచి చూశారు కూడా. కానీ ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్ళివచ్చిన రేవంత్ రెడ్డి వంటి విశ్వసనీయత లేని నాయకుడితో తాము చర్చించదలచుకోలేదని, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ వంటి విశ్వసనీయత కలిగిన వారు ఎవరైనా వస్తేనే చర్చకు వస్తామంటూ బహిరంగ చర్చకు హాజరుకాకుండా తప్పించుకొన్నారు. 

రేవంత్ రెడ్డి నిన్న అమరవీరుల స్థూపం వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “ముందుగా వాళ్ళే మాకు సవాలు విసిరారు. దానిని మేము స్వీకరించి ఇక్కడికి వస్తే కుంటిసాకులు చూపి చర్చలకు రాకుండా పారిపోయారు. విద్యుత్ కొనుగోళ్ళ వ్యవహారంలో అవినీతి జరిగిందని నిరూపించడానికి మావద్ద బలమైన ఆధారులున్నాయి. ఒకవేళ వాటిని నిరూపించలేకపోతే నేను అబీడ్స్ సెంటరులో ప్రజలందరి సమక్షంలో ముక్కును నేలకు రాసి క్షమాపణలు కోరడానికి సిద్దంగా ఉన్నాను. తెరాస సర్కార్ తప్పు చేసింది కనుకనే వారు మాతో బహిరంగ చర్చకు భయపడ్డారు. ముందూ వెనుకా చూడకుండా ఈ అంశం మీద వారు మాకు సవాళ్లు విసిరినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ వారు ముగ్గురికీ ప్రగతి భవన్ లో మొట్టికాయలు వేసినందునే వారు మొహం చాటేశారు. ఒకవేళ తెరాస సర్కార్ దీనిపై బహిరంగచర్చకు అంగీకరించకపోతే, సిబిఐ విచారణకు ఆదేశించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. సీనియర్ రాజకీయ నేతలైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిల స్థాయి బాల్క సుమన్, పల్లా, భానుప్రసాద్ లకు లేదు. వారికి మా కార్యాలయంలో అటెండర్ సరిపోతాడు. ఇప్పటికైనా తెరాస నేతలకు దమ్ముంటే ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలి,” అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 

రాష్ట్రంలో రైతులకు నిరంతర ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవాలనుకొన్న తెరాస నేతలను ఇటువంటి వివాదంలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి కల్పించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నేతలకు గొప్పగా సవాళ్ళు విసిరి ఆఖరు నిమిషంలో వెనక్కు తగ్గడంతో తెరాస నేతలు నవ్వులపాలయ్యారు. కాంగ్రెస్ నేతలు తమ ఆరోపణలు నిజమని ఇప్పుడు ఇంకా గట్టిగా చెప్పుకొనే అవకాశం చేజేతులా కల్పించినట్లయింది. 


Related Post