ఆధార్ లో మళ్ళీ మరో ప్రయోగం!

January 11, 2018


img

ప్రభుత్వం ఏదైనా ఒక వ్యవస్థను లేదా చట్టాలను లేదా నియమనిబంధనలను రూపొందిస్తున్నప్పుడు దాని గురించి లోతుగా అధ్యయనం చేసి, దానిలో సాధకభాధకాల గురించి తెలుసుకొంటే ఆ తరువాత ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావు. కానీ ప్రభుత్వాలు కూడా సాధారణ వ్యక్తులలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, వాటి వలన ప్రజలు నానా ఇబ్బందులు పడటం పరిపాటిగా మారిపోయింది.

ఆధార్ అమలులో కూడా ప్రస్తుతం అదే జరుగుతోంది. దానిని దేశంలో ప్రవేశపెడుతున్నప్పుడే ప్రజల సమగ్ర సమాచారం సేకరించి వాటిని క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డు రూపంలో ‘భద్రంగా’ నిక్షిప్తం చేసి ఉండి ఉంటే నేడు ప్రజలకు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసిన అవసరం ఉండేది కాదు. కానీ ఏ-4 సైజులో బారెడు కార్డును రూపొందించి దానిలో ప్రజల వ్యక్తిగత వివరాలను ఎవరైనా చూడగలిగే అవకాశం కల్పించింది.

యూఐడీఏఐ సేకరించిన ఆ వివరాలను కూడా ఎక్కడి నుంచైనా హ్యాక్ చేయవచ్చని అమెరికాకు చెందిన విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నో డెన్ నిరూపించి చూపినప్పుడు, అటువంటి ప్రమాదం ఏమీ లేదని గట్టిగా వాదించిన యూఐడీఏఐ ఇప్పుడు భద్రత కోసమే సరికొత్త ‘వర్చువల్ ఐడి’ విధానాన్ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. దీనిని ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి ప్రవేశ పెట్టబోతోంది. 

దీనిలో ఆధార్ కు బదులు 16 అంకెలతో కూడిన ఒక రహస్య నెంబరును పౌరులు తమంతట తామే యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా సృష్టించుకోవలసి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ లేదా మరే ఇతర పనులకైనా ప్రజలు ఆధార్ కార్డుకు బదులు ఆ రహస్య నెంబరును ఇస్తే సరిపోతుంది. ఆ నెంబరుతో అవసరమైన సమాచారం మాత్రమే కనిపిస్తుంది తప్ప వ్యక్తుల పూర్తి వివరాలను ఇతరులు తెలుసుకోవడానికి వీలుపడదు. బ్యాంక్ కార్డుల పిన్ నెంబర్ ను మార్చుకొన్నట్లుగానే దీనిని కూడా ఎన్నిసార్లయినా యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా మార్చుకోవచ్చు. 

అయితే షరా మామూలుగానే దీనిలో కూడా అనేక లోపాలు కొట్టవచ్చినట్లు కనబడుతున్నాయి. భారత్ లో కోట్లాది మంది నిరక్షరాస్యులను, కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారున్నారు. వారిని పరిగణనలోకి తీసుకోకుండా ఈ కొత్త విధానాన్ని అమలుచేయడానికి యూఐడీఏఐ సిద్దం అవుతున్నట్లుంది. ఒక గ్రామీణపౌరుడు లేదా నిరక్షరాస్య మహిళ ఈ రహస్య నెంబరును పొందాలంటే తప్పనిసరిగా తమ పూర్తి వివరాలను ఇతరులకు తెలియజేయవలసి ఉంటుంది. ఆ తరువాత వారి వివరాలు సదరు వ్యక్తి చేతిలోనే ఉంటాయి కనుక వాటిని దురుపయోగం చేయవచ్చు లేదా మళ్ళీ కొత్త రహస్య నెంబరును సృష్టించుకోవచ్చు. పైగా ఈరోజుల్లో 16 నెంబర్లను ఎవరు మనసులో గుర్తుపెట్టుకోగలరు?

దానినే ఆధార్ కార్డుగా భావించాలని లేకపోతే చట్టప్రకారం కటిన చర్యలు తీసుకొంటామని యూఐడీఏఐ చెప్పినప్పటికీ, 130కోట్ల మంది జనాభా ఉన్న భారత్ లో అది సాధ్యమేనా? అనే సందేహం కలుగకమానదు. కనుక ఇటువంటి  ప్రయోగాలు చేసే ముందు సంబంధిత అధికారులు ఏసీ రూములలో కూర్చొని నిర్ణయాలు తీసుకోవడం కంటే క్షేత్రస్థాయిలో పర్యటించి దానిలో సాధకబాధకాలను తెలుసుకొంటే ఇటువంటి లోపాలు పునరావృతం కావు.


Related Post