శభాష్ భారత్!

January 10, 2018


img

గత మూడున్నరేళ్ళలో కేంద్రప్రభుత్వం చేపట్టిన అనేక సంస్కరణల ఫలితంగా భారత్ వృద్ధిరేటు చాలా మెరుగుపడిందని ప్రపంచ బ్యాంక్ కితాబు ఇచ్చింది.  ప్రపంచ బ్యాంక్ లో భాగంగా పనిచేస్తున్న డెవెలప్మెంట్ ప్రాస్పెక్ట్స్ గ్రూప్ డైరెక్టర్ అయాన్ కోస్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, “చైనాతో పోలిస్తే భారత్ వృద్ధిరేటు చాలా మెరుగుపడింది. మంచి వృద్ధిరేటు సాధించగల సత్తా భారత్ కు ఉంది. భారత్ లో చాలా మంచి అవకాశాలున్నాయి. నేను తాత్కాలికంగా కనిపిస్తున్న ఫలితాలను, గణాంకాలను పట్టించుకోదలచుకోలేదు. దీర్ఘకాలంలో రాబోయే ఫలితాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే, వచ్చే దశాబ్దకాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాల కంటే భారత్ లో అభివృద్ధి, వృద్ధిరేటు ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నాను. ఈ ఆర్ధిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు 7.3 శాతం, రాబోయే రెండేళ్లలో 7.5 శాతం ఉండవచ్చని భావిస్తున్నాము,” అని చెప్పారు. 

“గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్-2018” అంచనాలలో భాగంగా ప్రపంచ బ్యాంక్ చెప్పిన ఈ నాలుగు మంచి ముక్కలు చాలా ప్రోత్సహాకరంగా ఉన్నాయి. నిజానికి భిన్న సంస్కృతులు, బాషలు, మతాలు కలిగి నిత్యం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్న భారత్ ను అభివృద్ధిపధంలో నడిపించిన ఘనత తప్పకుండా ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుంది. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రాల అభివృద్ధి..తద్వారా దేశాభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం చేసిందేమీ లేదు. ‘కేంద్రం అంటే పెద్దన్న అది చెప్పిందే వేదం’ అన్నట్లు వ్యవహరించేది తప్ప రాష్ట్రాలలో మౌలిక వసతుల కల్పన, పారిశ్రామికాభివృద్ధి, సంక్షేమ రంగానికి ఉదారంగా నిధులు కేటాయించేది కాదు. కానీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ అన్ని రాష్ట్రాలలో సమాంతరంగా అభివృద్ధి సాధించేందుకు కేంద్రప్రభుత్వం అవసరమైన చేయూతనందిస్తోంది. అదేవిధంగా అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్లుగా నిలుస్తున్న నియమనిబంధనలను, ప్రభుత్వ శాఖలను, కమిటీలను సమూలంగా ప్రక్షాళన చేసి అనేకానేక సంస్కరణలు అమలుచేస్తోంది. అందుకు గొప్ప ఉదాహరణగా జి.ఎస్.టి.ని చెప్పుకోవచ్చు. కానీ నిరంతరంగా ఈ అభివృద్ధిపనులు జరగాలన్నా, వృద్ధిరేటు పెరగాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఇటువంటి స్థిరమైన, బలమైన, సాహసోపేతమైన ప్రభుత్వాలు ఉండటం చాలా ఆవసరం. 


Related Post