టి-భాజపాకు టిటిడిపి పరిస్థితేనా?

January 10, 2018


img

ఒకప్పుడు తెలంగాణాలో తెదేపా, భాజపాలు చాలా బలంగా ఉండేవి. కానీ ఇప్పుడు వాటి పరిస్థితి చాలా దయనీయంగా కనిపిస్తోంది. కారణాలు అందరికీ తెలిసినవే. రాష్ట్రంలో తెదేపా గురించి పెద్దగా చెప్పుకోవలసిందేమీ లేదు కానీ భాజపా గురించి చెప్పుకోక తప్పదు. కేంద్రంలో భాజపాయే అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో భాజపాలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఆ పార్టీకున్న మతతత్వముద్ర ఒక కారణంకాగా, ఆ పార్టీకి కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లేకపోవడం మరో కారణంగా చెప్పుకోవచ్చు. తెలంగాణాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను ఆ పదవిలో నుంచి తప్పించడమే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఒకవేళ రాష్ట్ర భాజపా నేతలకు కేంద్రంలో చాలా ప్రాధాన్యం ఇచ్చి ఉండి ఉంటే తప్పకుండా ఇతర పార్టీల నేతలు భాజపాలోకి వచ్చేందుకు ఆసక్తి చూపేవారు. కానీ రాష్ట్ర భాజపా నేతలను కేంద్రం పట్టించుకోకపోవడంతో పార్టీలో ఉన్నవారే ఒకరొకరుగా బయటకు వెళ్ళిపోతున్నారు. సంక్రాంతి పండుగ తరువాత ఇతర పార్టీలలో ప్రముఖనేతలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి నమ్మకంగా చెప్పుతున్న సమయంలోనే నాగం జనార్ధనరెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలు రావడం గమనిస్తే, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ భాజపాకు షాకులు తప్పవని అర్ధం అవుతోంది. అదే కనుక జరిగితే భాజపా కూడా తెదేపాలాగ అవశేషంగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ భాజపా ఇంకా బలహీనపడినట్లయితే ఇక తెరాసతో పొత్తులు గురించి ఆలోచన కూడా చేయలేదు. ఎందుకంటే, బలహీనమైన పార్టీలతో దానికి పొత్తులు పెట్టుకోవలసిన అవసరమే ఉండదు. 

తెరాసతో పొత్తులు పెట్టుకోకపోయినా వచ్చే ఎన్నికలలో భాజపా గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకోవలంటే తప్పనిసరిగా పార్టీని బలోపేతం చేసుకోవాలి. ప్రస్తుత రాజకీయ పరిబాషలో చెప్పాలంటే ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడంగా చెప్పుకోవలసి ఉంటుంది. అందుకోసం ముందుగా రాష్ట్ర నేతలకు కేంద్రం ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే మార్గంగా కనిపిస్తోంది. అది సాధ్యంకాదనుకొంటే రాష్ట్ర భాజపాపై పెద్దగా ఆశలు పెట్టుకోనవసరం లేదు. ఎందుకంటే, వచ్చే ఎన్నికల తరువాత కూడా తమ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా ఉంటుందని గ్రహిస్తే ఎంతమంది పార్టీని అంటిపెట్టుకొని ఉంటారో అనుమానమే! కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మంచిది. 


Related Post