కెసిఆర్ వల్ల ప్రభుత్వానికి రూ.957 కోట్లు నష్టం!

January 10, 2018


img

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ పై మళ్ళీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. గాంధీ భవన్ లో మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “ఈ మూడున్నరేళ్ళలో రాష్ట్రంలో కొత్తగా ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ఉత్పత్తి కాలేదు. గతంలో యూపియే ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాల వలననే నేడు దేశంలో మిగులు విద్యుత్ ఉంది. దానినే కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. మరి అందులో ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్పదనం ఏముంది? అసలు అది ఎలా సాద్యం అయ్యిందో ఎందుకు చెప్పడం లేదు? రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్ ఘడ్ వంటి ఇరుగుపొరుగు రాష్ట్రాలతో విద్యుత్ సరఫరా కోసం అనాలోచితంగా చేసుకొని ఒప్పందాల కారణంగా ప్రభుత్వానికి రూ.957 కోట్లు నష్టం వస్తోంది. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? రాష్ట్రానికి ఇంత నష్టం కలిగించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రభాకర్ రావు ఇద్దరు జైలుకు పోతారా? ట్రాన్స్ కో, జెన్ కోలకు ఐఏఎస్ అధికారులను నియమించకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ తన సన్నిహితులకు వాటి బాధ్యతలు అప్పగించి, తను చేస్తున్న తప్పిదాలను, ఇటువంటి లోపాలను బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న తప్పులు, అనాలోచిత నిర్ణయాలతో ఆ రెండు సంస్థలు కూడా భ్రష్టు పట్టించేస్తున్నారు. ఈ మూడున్నరేళ్ళలో ఇతర రాష్ట్రాలతో, ప్రైవేట్ సంస్థలతో విద్యుత్ సరఫరాకు చేసుకొన్న ఒప్పందాలు, ఎంత విద్యుత్ సరఫరా అవుతోంది? దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెల్లిస్తోంది? మొదలైన వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను,” అన్నారు రేవంత్ రెడ్డి.

రైతులందరికీ నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తుంటే దానికీ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెపుతున్నారని తెరాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు ఆగ్రహం చెందడం సహజమే. కానీ కాంగ్రెస్ నేతలు అడుగుతున్న ఈ ప్రశ్నలకు ఎవరూ సంతృప్తికరమైన సమాధానాలు చెప్పే ప్రయత్నం చేయకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. తెరాస సర్కార్ ఒక మంచి పని చేస్తున్నానని భావిస్తున్నప్పుడు దానికి సంబందించిన వివరాలను ప్రతిపక్షాలకు తెలియజేయడానికి సంకోచించవలసిన అవసరమేమిటి? ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పనంతకాలం అవి విమర్శలు చేస్తూనే ఉంటాయి కదా! వాటి వలన ప్రజలలో కూడా అనుమానాలు అపోహలు కలిగే అవకాశం ఉంటుంది కదా! 

అలాగే యూపియే హయంలో తీసుకొన్న నిర్ణయాల కారణంగానే దేశంలో మిగులు విద్యుత్ ఏర్పడిందని వాదిస్తున్న కాంగ్రెస్ నేతలు, మరి తెలంగాణా రాష్ట్రం ఏర్పడక మునుపు సమైక్య రాష్ట్రంలో అంత విద్యుత్ సంక్షోభం ఎందుకు ఏర్పడింది? దానికి ఎవరు బాధ్యులు? రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారగానే మంత్రదండంతో మాయం చేసినట్లు 3-6 నెలలోనే విద్యుత్ సంక్షోభం ఎలా సమసిపోయింది?అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగితే బాగుంటుంది.


Related Post