మన దేశంలో ఇప్పుడు ప్రతీది ఆధార్ తో అనుసంధానిస్తున్నారు. అంటే ఒక్క ఆధార్ నెంబర్ తో ఒక వ్యక్తికి సంబందించిన సమస్త సమాచారం చేతికి వస్తుందన్నమాట. కనుక ఆధార్ డేటాను సురక్షితంగా భద్రపరచవలసిన బాధ్యత యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ)దే అవుతుంది. కానీ అమెరికాలో ‘విజిల్ బ్లోయర్’ గా పేరొందిన ఎడ్వర్డ్ స్నోడెన్ ఇటీవల ఒక భారతీయ జర్నలిస్ట్ సాయంతో యుఐడిఎఐ కంప్యూటర్లలో భద్రపరిచిన ఆధార్ డేటాను హ్యాక్ చేసి చూపించారు. కేవలం రూ.500లు ఖర్చు చేస్తే చాలు ఎవరికి సంబంధించిన ఆధార్ డేటా అయినా లభిస్తుందని స్నోడెన్ నిరూపించి చూపాడు. కనుక యుఐడిఎఐ చెప్పుకొంటున్నట్లుగా దేశప్రజల వ్యక్తిగత సమాచారానికి ఎటువంటి భద్రత లేదని స్పష్టం చేశారు.
ఈ విషయం బయటకు పొక్కడంతో యుఐడిఎఐ స్నోడెన్ ఆరోపణలను గట్టిగా ఖండించింది. ఆధార్ డేటాకు కట్టుదిట్టమైన, సురక్షితమైన భద్రతా వ్యవస్థ ఉందని దానిని తస్కరించడం ఎవరి వల్లా కాదని గట్టిగా సమర్ధించుకొంది. ఆధార్ డేటా లీక్ కావడానికి కారకుడైన జర్నలిస్టుపై కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే యుఐడిఎఐ వాదనలు తప్పని, స్నోడెన్ చేసిన ఆరోపణలు నిజమని స్పష్టం అవుతోంది.
జర్నలిస్టుపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలుసుకొన్న స్నోడెన్ స్పందిస్తూ, “ఆధార్ డేటా లీక్ చేయడం సాధ్యమేనని నిరూపించి చూపిన జర్నలిస్టుకు అవార్డు ఇచ్చి గౌరవించాలి తప్ప కేసులు పెట్టి శిక్షించడం సరికాదు. ఒకవేళ శిక్షించవలసివస్తే, ఆధార్ డేటాను లీక్ ప్రూఫ్ గా భద్రపరచడంలో విఫలమైన యుఐడిఎఐ అధికారులను శిక్షించాలి,” అని అన్నారు.
వాస్తవానికి భారతదేశంలో ఆధార్ వివరాలే కాదు...వ్యక్తుల బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల పిన్ నెంబర్లను కూడా షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకులలో అడుగుతుంటారు. చాలామంది ప్రజలు కూడా ఏమాత్రం సంకోచించకుండా చెపుతుంటారు. ఇక మొబైల్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఫోన్ కాంటాక్ట్స్, ఫోన్ లో ఉన్న సమస్త సమాచారాన్ని నిసంకోచంగా ఇచ్చేస్తుంటారు. అంటే మొబైల్ బ్యాంకింగ్ చేసేవారి పిన్ నెంబర్లతో సహా పూర్తి వివరాలు ఎవరో అపరిచితులకు చేతులలో వెళ్ళిపొతుంటాయి. అటువంటిది ఆధార్ కార్డు వివరాలను సేకరించడం పెద్ద కష్టమా? ఇప్పటికైనా భారత్ సర్కార్ పటిష్టమైన ఆన్-లైన్ భద్రతావ్యవస్థలను ఏర్పాటు చేసుకోకపోయినట్లయితే ఈ ఆధార్ లింకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వగైరాలు ఏదో ఒకరోజు పెద్ద ఉపద్రవానికి దారితీసినా ఆశ్చర్యం లేదు.