మరుగుదొడ్డే వారి ఇల్లు!

January 09, 2018


img

ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో చిరునోముల గ్రామంలో హృదయవిదారకమైన సంఘటన వెలుగు చూసింది. ఒక నిరుపేద కుటుంబం తలదాచుకోవడానికి గూడు లేకపోవడంతో గత నాలుగేళ్ళుగా గ్రామంలో ఉన్న ఒక మరుగుదొడ్డిలో నివసిస్తున్నారు. లెట్రిన్ కమోడ్ లో ఒక రాయిని పెట్టి దానిపై అట్టముక్కలు పరుచుకొని, దానిలోనే నివసిస్తున్నారు. మొత్తం ఐదుగురు సభ్యులున్న కొర్ని బూదమ్మ కుటుంబంలో రాత్రిపూట ఆమె తన కూతురు, ఇద్దరు మనుమలను పెట్టుకొని లెట్రిన్లో కాళ్ళు ముడుచుకొని నిద్రిస్తుంది. అల్లుడు జేమ్స్ బయట పడుకొంటారు. ఉన్న ఒక్క గుడిసె కూలిపోవడంతో, మళ్ళీ కొత్తది నిర్మించుకోలేని దుస్థితిలో ఉన్నందునే మరుగుదొడ్డిలో తలదాచుకొంటున్నామని బూదమ్మ, ఆమె కూతురు నాగరత్నం, అల్లుడు విలేఖరులకు చెప్పారు. రోజు కూలి చేసుకొని బ్రతుకుతున్న తమకు తిండి గడవడమే కష్టంగా ఉందని, తలదాచుకోవడానికి గుడిసెను కూడా నిర్మించుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తమకు ఒక డబుల్ బెడ్ రూమ్ ఇంటిని ఇప్పించవలసిందిగా కోరుతూ అధికారుల చుట్టూ చాలాసార్లు తిరిగామని కానీ ఎవరూ పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టీమాస్ ఫోరం కమిటీ సభ్యులు ఇటీవల గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజాసమస్యలపై సర్వే నిర్వహిస్తున్నప్పుడు హృదయవిదారకమైన బూదమ్మ కుటుంబ దుస్థితి బయటపడింది. వారు గత నాలుగేళ్ళుగా మరుగుదొడ్డిలోనే నివాసం ఉంటున్న సంగతి గ్రామ సర్పంచ్ తో సహా అందరికీ తెలుసు కానీ ఎవరూ వారిని పట్టించుకోలేదు అసలు వారిది ఒక సమస్యగానే భావించకపోవడం చాలా బాధాకరం. 

అనంతరం టీమాస్ ఫోరం కమిటీ సభ్యులు తహసిల్దార్ జి సుదర్శన్ రావుకి బూదమ్మ కుటుంబ పరిస్థితి గురించి వివరిస్తూ ఒక వినతిపత్రం అందజేసి, వారి కుటుంబానికి ఒక డబుల్ బెడ్ రూమ్ ఇంటిని మంజూరు చేయవలసిందిగా కోరారు. వారి అభ్యర్ధనను, బూదమ్మ కుటుంబ పరిస్థితిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి వారికి ఒక ఇల్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని తహసిల్దార్ చెప్పారు. 


Related Post