రాష్ట్ర బడ్జెట్ 1.80 లక్షల కోట్లు?

January 09, 2018


img

ఈసారి 2018-19 సం.ల రాష్ట్ర బడ్జెట్ సుమారు రూ.1.80 లక్షల కోట్లు ఉండవచ్చని సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పి సింగ్ నిన్న సచివాలయంలో అన్ని ప్రభుత్వశాఖల ప్రధానకార్యదర్శులతో సమావేశమయ్యి రాష్ట్ర బడ్జెట్ కోసం శాఖలవారిగా పంపించవలసిన ప్రతిపాదనల గురించి చర్చించారు.  ఈ నెల 17వ తేదీలోగా ఆన్-లైన్ ద్వారా ప్రతిపాదనలు పంపించాలని కోరారు. వాటి ఆధారంగా ఈ నెల 26వ తేదీలోగా ఆర్ధికశాఖ బడ్జెట్ ను రూపొందించి  ముఖ్యమంత్రి కెసిఆర్ కు అందజేస్తుంది. దానిని అయన పరిశీలించిన తరువాత మళ్ళీ అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించి అవసరమైన మార్పులు చేర్పులు సూచిస్తారు. అందుకు అనుగుణంగా బడ్జెట్ ను రూపొందించి సిద్దం చేసిన తరువాత శాసనసభ బడ్జెట్ సమావేశాలను షెడ్యూల్ ను నిర్ణయిస్తారు.

ఈలోగా కేంద్రప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది కనుక దానిలో రాష్ట్రానికి చేసిన కేటాయింపులపై స్పష్టత వస్తుంది. తదనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ కు తుది రూపం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.  జి.ఎస్.టి. అమలులోకి వస్తే రాష్ట్ర ఆదాయం కాస్త తగ్గుతుందని మొదట అందరూ భయపడినప్పటికీ, అది అమలులోకి వచ్చిన తరువాత కూడా రాష్ట్ర ఆదాయంలో 19 శాతం వృద్ధిరేటు ఉందని నిన్న జరిగిన సమావేశంలో అధికారులు నిర్ధారించారు. 

2017-18 ఆర్ధిక సంలలో రాష్ట్ర బడ్జెట్ రూ.1,49,646 లక్షల కోట్లు ఉండగా ఈసారి సుమారు రూ.1.80 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ లెక్కన ఈసారి మరో 30,000 కోట్లు పెరుగుతుంది కనుక ఈసారి బడ్జెట్ లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఒకవేళ కేంద్రం కూడా రాష్ట్రానికి ఉదారంగా నిధులు కేటాయిస్తే అభివృద్ధి పనులు ఇంకా జోరందుకోవచ్చు.


Related Post