రైతులకు ఆ డబ్బు అందించడం ఎలా?

January 08, 2018


img

ఈ ఏడాది మే 15వ తేదీ నుంచి రాష్ట్రంలో రైతులందరికీ ఎకరానికి రూ.4,000 చొప్పున రెండు పంటలకు కలిపి రెండు దఫాలుగా మొత్తం 8,000 అందించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే ఆ సొమ్మును రైతుల బ్యాంక్ ఖాతాలలో జామా చేసినట్లయితే, దానిని అప్పు లేదా వడ్డీ క్రింద బ్యాంకులు జమచేసుకొనే అవకాశం ఉన్నందున, ఆ డబ్బును రైతులకు అందించేందుకు ప్రత్యమ్నాయమార్గాలను అన్వేషించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు కేటిఆర్, తుమ్మల నాగేశ్వరరావు, హరీష్ రావు, ఈటల రాజేందర్ లతో కూడిన ఒక సబ్-కమిటీని ముఖ్యమంత్రి కెసిఆర్ ఏర్పాటుచేశారు. వారు ఈరోజు సమావేశమయ్యి ఈ సమస్య గురించి లోతుగా చర్చించారు. త్వరలోనే మళ్ళీ మరోమారు సమావేశమవుతామని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఎట్టిపరిస్థితులలో మే 15వ తేదీ నుంచి రైతులకు ఆ డబ్బును అందజేస్తామని మంత్రి చెప్పారు. 

నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా, ఏడాదికి రెండు పంటలను పండించుకొనేందుకు అవసరమైన పెట్టుబడిని అందించడం, అందుకు సాగునీరు, పండించిన పంటలను నిలువ చేసుకోవడానికి గోదాముల నిర్మాణం, పంటలకు గిట్టుబాటు ధరలు రాకపోతే వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలనుకోవడం వంటి చర్యలన్నిటినీ గమనించినట్లయితే, రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలనే తెరాస సర్కార్ తపన కనిపిస్తుంటుంది. అందుకు దానిని అభినందించక తప్పదు. అయితే ఎంత గొప్ప ఆలోచనలనైనా వాటిని అంతే సమర్ధంగా నిర్వహించగలిగినప్పుడే వాటి ప్రయోజనం లభిస్తుంది. అప్పుడే ప్రభుత్వానికీ మంచిపేరు లభిస్తుంది. 

కనుక ఇటువంటి బారీ పధకాలను చేపట్టినప్పుడు అందుకు తగిన ఆర్ధికవనరులను సమీకరించుకోవడం, ఎవరూ వేలెత్తిచూపలేనివిధంగా వాటి అమలుకు నిర్దిష్టమైన ప్రణాళిక, యంత్రాంగం ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా అవసరమే. రైతులకు ఒక్క పంటకు ఎకరానికి రూ.4,000 చొప్పున అందించాలంటే సుమారు రూ.6,000 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేసినట్లు సమాచారం. ఆ లెక్కన ఏడాదికి రెండు పంటలకు కలిపి రూ.8,000 పెట్టుబడి అందించేందుకు ప్రతీ ఏడాది రూ.12,000 కోట్లు అవసరమని అర్ధమవుతోంది. ఇది నిరంతరంగా అందించాలని తెరాస సర్కార్ భావిస్తోంది కనుక ప్రతీ ఏటా బడ్జెట్ లో అంత సొమ్ము తప్పనిసరిగా కేటాయించవలసి ఉంటుంది. లేకుంటే అభాసుపాలయ్యే ప్రమాదం ఉంది. ఉదాహరణకు చాలా మంచి ఉద్దేశ్యంతో అమలుచేసిన బతుకమ్మ చీరల పంపిణీ తెరాస సర్కార్ కు తీరని అప్రదిష్ట కలిగించగా, కెసిఆర్ కిట్స్ ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది.

అదేవిధంగా మిషన్ కాకతీయ, భగీరధ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి ప్రాజెక్టుల నిర్మాణంలో సమర్ధమైన నిర్వహణ, పర్యవేక్షణ కారణంగా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. తద్వారా తెరాస సర్కార్ కు దేశవ్యాప్తంగా చాలా మంచిపేరు తెచ్చిపెడుతున్నాయి. కనుక ఈ పధకం అమలు కోసం చాలా ముందు చూపు, సమర్ధమైన నిర్వహణ, పర్యవేక్షణ కూడా చాలా అవసరమే.


Related Post