ఆర్డిఎస్ ప్రాజెక్టుకు నేడు శంఖుస్థాపన

January 08, 2018


img

మహబూబ్ నగర్ జిల్లాలో రాజోళి మండలంలోని తుమ్మిళ్ళ గ్రామం వద్ద నిర్మిస్తున్న రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డిఎస్) పధకానికి నేడు రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు శంఖుస్థాపన చేయనున్నారు. జిల్లాలో నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని, శంఖుస్థాపన కార్యక్రమం కోసం ఆగకుండా ప్రాజెక్టు పనులను ప్రారంభించవలసిందిగా మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించడంతో గత ఏడాది సెప్టెంబర్ లోనే దీని మొదటిదశ పనులు మొదలు పెట్టేశారు. దానికే నేడు అయన లాంఛనంగా శంఖుస్థాపన చేయనున్నారు.  

రూ.783 కోట్లు అంచనాతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును రెండు దశలలో నిర్మించనున్నారు. మొదటి దశలో రూ. 397 కోట్లతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ఎత్తిపోతల పధకం ద్వారా సుంకేశుల రిజర్వాయర్ నుంచి 70 రోజులలో 5.44 టిఎంసిల నీటిని ఆర్డిఎస్ కాలువ ద్వారా గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాలలో 75 గ్రామాలలో 87,500 ఎకరాలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. వాటిలో 31,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. కనుక మిగిలిన 55,600 ఎకరాలకు నీటిని అందజేసేందుకు వీలుగా తుమ్మిళ్ళ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించబోతున్నారు. తుమ్మిళ్ళ గ్రామం వద్ద తుంగభద్రానది నుంచి అప్రోచ్ ఛానల్ నిర్మించి, పంప్ హౌస్ ఏర్పాటు చేస్తున్నారు. దానిలో మూడు బారీ పంప్ సెట్ లు ఏర్పాటు చేస్తున్నారు. 

మొదటిదశ ప్రాజెక్టులో ఆర్డిఎస్ కాలువకు సమాంతరంగా సుమారు 75 కిమీ పొడవునా రెండు బారీ పైప్ లైన్లను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా 687 క్యూసెక్కుల నీటిని 75 కిమీ దూరం తరలించి అక్కడ మళ్ళీ ఆర్డిఎస్ కాలువలో నింపుతారు. ఆర్డిఎస్ కాలువ చివరి ఎకరానికి కూడా నీళ్ళు అందించాలనే ఆలోచనతోనే పైపులను ఏర్పాటు చేశారు. 

ఇక రూ.386 కోట్లతో వ్యయంతో చేపట్టబోయే రెండవ దశ ప్రాజెక్టు ద్వారా మల్లమ్మకుంట, జూలకల్, వల్లూర్ వద్ద జలాశయాలను, కాలువలను, పంప్ హౌస్ వగైరాలను నిర్మిస్తారు. రెండవదశ నిర్మాణ పనులు మొదలుపెట్టడానికి వీలుగా అధికారులు అప్పుడే భూసేకరణ ప్రక్రియ కూడా మొదలుపెట్టేశారు. ఈ రెండవ దశ పధకం ద్వారా 392 క్యూసెక్కుల నీటిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకొని అందుకు అనుగుణంగా 10.5 మెగావాట్స్ సామర్ధ్యం గల బారీ పంపును ఏర్పాటు చేయబోతున్నారు. 

తుమ్మిళ్ళ గ్రామం దగ్గర లాంఛనంగా శంఖుస్థాపన కార్యక్రమం పూర్తయిన తరువాత అక్కడే చిన్న బహిరంగ సభ జరుగుతుంది. మంత్రి హరీష్ రావు తదితరులు దానిలో ప్రసంగిస్తారు.


Related Post