త్వరలో ప్రొఫెసర్ గారు కూడా పార్టీ షురూ?

January 08, 2018


img

ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ఎక్కడైనా కొత్త పార్టీలు పుట్టుకు రావడం సహజమే. అయితే వాటిలో అధిక శాతం ఎన్నికల తరువాత కనబడకుండా పోతుంటాయి. తెలంగాణాలో ఇప్పటికే 35కు పైగా రాజకీయపార్టీలున్నాయి. వాటిలో 31 చిన్నచిన్న పార్టీలన్నీ కలిసి సిపిఐ (ఎం) అధ్వర్యంలో ‘బహుజన లెఫ్ట్ ఫ్రంట్’ ను ఏర్పాటుచేస్తున్నట్లు సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. తమ కూటమి రాష్ట్రంలో గల మొత్తం 119 స్థానాలలోను పోటీ చేస్తుందని అయన చెప్పారు. ఈ కూటమి ఏర్పాటు కోసం సిపిఐ (ఎం) అధ్వర్యంలో జరిగిన సమావేశాలకు ప్రొఫెసర్ కోదండరాం కూడా హాజరయ్యారు. కానీ అయనకు దానిపై నమ్మకం లేనందునో ఏమో... టిజెఎసిని రాజకీయ పార్టీగా మార్చాలనుకొంటున్నామని తెలియజేశారు.

ప్రొఫెసర్ కోదండరాం ఆదివారం హైదరాబాద్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “తెరాస సర్కార్ పాలనలో తెలంగాణా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్న వాటిని అది పట్టించుకొనే పరిస్థితిలో లేదు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది. కనుక రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ ఏర్పాటుకు సమయం ఆసన్నమైంది. టిజెఎసిని రాజకీయ పార్టీగా మార్చాలా లేక దానిని యధాతధంగా కొనసాగిస్తూ వేరేగా రాజకీయపార్టీని స్థాపించాలా? అనే దానిపై టిజెఎసి సభ్యులందరితో చర్చించుకొని త్వరలోనే మా నిర్ణయం ప్రకటిస్తాము,” అని చెప్పారు.

ఇంతకాలం అయన కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ప్రభుత్వంపై పోరాటాలు చేస్తున్నందున అయన ఆ పార్టీకి దగ్గరవుతున్నారనే భావన కలిగింది. అయన మేధావి ముసుగులో కాంగ్రెస్ పార్టీ తరపున పని చేస్తూ తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని తెరాస సర్కార్ కూడా ఆరోపిస్తుండటం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పుడు అయన కొత్తగా మరో పార్టీ ఏర్పాటుకు సిద్దం అవుతున్నట్లు ప్రకటించడంతో వచ్చే ఎన్నికలలో ఓట్లు చీల్చి కాంగ్రెస్ పార్టీకి మేలు కలిగించేందుకే దానిని స్థాపిస్తున్నారా?అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే, ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ సహకారంతో తెరాస సర్కార్ పై పోరాటాలు చేసిన అయన వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తారనుకోలేము. కనుక అయన ఏ ఉద్దేశ్యంతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారో రానున్న రోజులలో స్పష్టం అవుతుంది.


Related Post