గవర్నర్ పై హనుమంతన్న విమర్శలు

January 06, 2018


img

గవర్నర్ నరసింహన్ కు కాంగ్రెస్ నేతలకు మధ్య నిన్న రాజ్ భవన్ లో జరిగిన వాగ్వదాలకు కొనసాగింపు అన్నట్లుగా ఇవ్వాళ్ళ సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు కూడా గవర్నర్ నరసింహన్ పై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “ఆయనకు ఎప్పుడూ గుళ్ళూ గోపురాలు తిరగడం తప్ప ఎప్పుడైనా రాష్ట్రాన్ని, ఆయన దృష్టికి తీసుకువస్తున్న ప్రజా సమస్యలను పట్టించుకోలేదు. అయన ఎంతసేపు ముఖ్యమంత్రి కెసిఆర్ కు చెంచాగిరీ చేయడానికే పరిమితం అవుతుంటారు,” అని విమర్శించారు. 

వి. హనుమంతరావు చేస్తున్న విమర్శలు చాలా కటువుగా ఉన్నప్పటికీ, వాటిలో వాస్తవం లేకపోలేదు. ఈ మూడేళ్ళలో ప్రతిపక్షాలు ఆయనకు అనేక సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చాయి. అవన్నీ చెత్తబుట్టలోకి వెళ్ళిపోయాయి తప్ప గవర్నర్ నరసింహన్ ఎటువంటి చర్యలు తీసుకొన్న దాఖలాలు కనబడలేదు. ఇక గవర్నర్ నరసింహన్ దంపతులకు దైవభక్తి కాస్త ఎక్కువే కానీ దానిని ఎవరూ తప్పు పట్టలేరు. ఇక గవర్నర్ నరసింహన్ చేసిన మంచిపని ఒకటే కనబడుతోంది. ఇరు రాష్ట్రాల మద్య ఉద్రిక్తతలు తగ్గడానికి తన వంతు గట్టిగానే ప్రయత్నించి, ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీలను సమావేశపరిచగలిగారు. అయితే అందరికీ తెలిసిన కారణాల వలన సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. అది వేరే సంగతి. వాస్తవానికి గవర్నర్ నరసింహన్ చురుకుగా వ్యవహరిస్తే ప్రభుత్వంతో సమస్యలు వస్తాయి. అలాగని ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరిస్తున్నా మౌనం వహిస్తే ఇదిగో ఈ విధంగా ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోక తప్పదు. కనుక గవర్నర్పదవి కత్తిమీద సాము వంటిదేనని చెప్పవచ్చు.


Related Post