వారి పాదయాత్రకు అనుమతి లభిస్తుందా?

January 06, 2018


img

నేరెళ్ళ ఘటన జరిగి నేటికి 200 రోజులు పూర్తవడంతో భాదితులకు న్యాయం చేయాలని కోరుతూ టి కాంగ్రెస్, సిపిఐ, సిపిఐ (ఎం), టిజెఎసి, ప్రజాసంఘాల నేతలు నేడు సిద్ధిపేట నుంచి నేరెళ్ళ వరకు పాదయాత్ర చేయబోతున్నారు. వారు ముందుగా సికింద్రాబాద్ లో క్లాక్ టవర్ చేరుకొని అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించిన తరువాత బస్సులో సిద్ధిపేటకు చేరుకొంటారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర మొదలుపెడతారు. 

వివిధ ప్రజాసమస్యలపై ప్రతిపక్షాలు, టిజెఎసి చేపడుతున్న పాదయాత్రలకు, ధర్నాలు, నిరాహార దీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు నిరాకరిస్తూనే ఉంది. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న మందకృష్ణ మాదిగ తన కార్యాలయంలోనే నిరాహారదీక్ష చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈరోజు ప్రతిపక్షాలు తలపెట్టిన ఈ పాదయాత్రతో నేరెళ్ళ గాయాన్ని మళ్ళీ కెలికి దానిపై కారం చల్లినట్లవుతుంది. కనుక వారి పాదయాత్రకు పోలీసులు అనుమతించకపోవచ్చు. ఒకవేళ పోలీసులు వారి పాదయాత్రను అడ్డుకొన్నా ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించకమానరు. తెరాస సర్కార్ కు దళితులంటే చులకన భావం ఉందని అందుకే వారికి ఆరు నెలలు గడిచినా న్యాయం చేయలేదని, వారికి న్యాయం చేయాలని కోరుతూ తామ పాదయాత్ర చేయబోతే తమనూ అడ్డుకొందని వారు విమర్శలు గుప్పించవచ్చు. కనుక ఏవిధంగా చూసినా ఈ పాదయాత్రతో తెరాస సర్కార్ కు చాలా ఇబ్బందికరమైనదేనని చెప్పవచ్చు.  


Related Post