విమర్శలైనా అవే సూచిస్తున్నాయి కదా!

January 05, 2018


img

తెరాస సర్కార్ పరిస్థితి చూస్తుంటే ‘ఇంట్లో ఈగల మోత..బయట పల్లకీలో ఊరేగింపులు’ అనే పాత నానుడి గుర్తుకువస్తే విచిత్రం కాదు. ఎందుకంటే రాష్ట్రంలో వివిధ రంగాలలో అది సాధిస్తున్న అభివృద్ధి, అది అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పధకాలను కేంద్రప్రభుత్వంతో సహా దేశంలో అనేక రాష్ట్రాలు..వాటి ప్రజలు ప్రశంసిస్తుంటే, రాష్ట్రంలో ప్రతిపక్షాలు కోడి గుడ్డుకు ఈకలు పీకడానికి ప్రయత్నించినట్లు తెరాస సర్కార్ ఏ పని చేసి చూపినా దానిలో తప్పులను ఎట్టి చూపించి, వాటిలో బారీగా అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. 

మరో విచిత్రమైన విషయమేమిటంటే, తెరాస సర్కార్ గత ప్రభుత్వాలను నిందిస్తుంటే, తెరాస సర్కార్ ఏ పధకం లేదా ప్రాజెక్టు అమలుచేసినా అది తమ ప్రభుత్వ హయంలో చేపట్టిన గట్టి నిర్మాణాత్మకమైన చర్యల ఫలాలే అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గట్టిగా చెప్పుకొంటున్నారు.     

ఉదాహరణకు జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో రైతులందరికీ నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా అందించినందుకు వివిధ రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి కెసిఆర్, విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ల ద్వారా అభినందనలు తెలియజేసి, మూడున్నరేళ్లలో దానిని ఏవిధంగా సాధించగలిగారో అడిగి తెలుసుకొంటున్నారు. తమ రాష్ట్రాలలో కూడా ఈ నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా పధకాన్ని ప్రారంభించడానికి తెరాస సర్కార్ సలహాలు, సూచనలు కోరుతున్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రం ఇటువంటి అరుధైన ఘనకార్యం సాధించి సర్వత్రా ప్రశంశలు అందుకోవడం అందరికీ గర్వకారణమే. 

నాణేనికి మరో వైపు చూస్తే, కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ నిన్న గాంధీ భవన్ లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఎన్ని విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించింది?వాటి నుంచి నేడు ఎంతెంత విద్యుత్ ఉత్పత్తి  అవుతోంది? కేంద్రం నుంచి ఎంత విద్యుత్ లభిస్తోంది? అవసరం లేకపోయినా చత్తిస్ ఘడ్ వంటి ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి తెరాస సర్కార్ ‘ఎక్కువ ధర’ చెల్లించి ఎంత విద్యుత్ కొనుగోలు చేస్తున్నది? తెరాస సర్కార్ హయాంలో కొత్తగా నిర్మాణాలు ప్రారంభించిన విద్యుత్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి ఏమిటి? వంటి వివరాలను మీడియా ప్రతినిధులకు వివరించారు. ఈ గణాంకాలు అన్నీ వివరించి తెరాస సర్కార్ కొత్తగా సాధించింది ఏమీ లేదని దాసోజు శ్రవణ్ తేల్చి చెప్పారు. 

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్న మీడియాతో మాట్లాడుతూ, “రైతులందరికీ నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా అందించడం వలన లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. రైతులు ఇష్టం వచ్చినట్లు మోటార్లు పెట్టి నీళ్ళు తోడివేస్తే భూగర్భజలాలు అడుగంటిపోతాయి,” అని అన్నారు.

కోమటిరెడ్డి చెప్పినట్లుగానే వివిధ ప్రాజెక్టుల నుంచి కాలువల ద్వారా వదులుతున్న నీరు చిట్టచివర ఉన్న పొలాలకు చేరడం లేదని, మద్యలో రైతులు అందరూ తమకు అవసరమైన దాని కంటే ఎక్కువ నీటిని మోటార్లు పెట్టి తోడుకొంటున్నారని అధికారులు చాలా ఆందోళన చెందుతున్నారని తెరాస సర్కార్ కు అధికారిక న్యూస్ ఛానల్ వంటి ‘నమస్తే తెలంగాణా’ నిన్ననే గణాంకాలతో సహా ఒక కధనం ప్రసారం చేసింది. 

ఈవిధంగా తెరాస సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రతీ దానికీ రెండు కోణాలు కనబడటం విచిత్రంగానే ఉంది. జుట్టు ఉంటేనే కొప్పు ఉంటుంది అన్నట్లుగా రాష్ట్రంలో ‘అభివృద్ధి’ కనబడుతోంది కనుకనే దానిపై ఇన్ని ప్రశంశలు, విమర్శలు వస్తున్నాయని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ మూడున్నరేళ్ళలోనే యావత్ దేశ ప్రజల దృష్టిని తెలంగాణా రాష్ట్రం వైపు తిప్పించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుంది. ఈ మహాభివృద్ధి యజ్ఞంలో భాగస్వాములుగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్, అయన మంత్రులు, అధికారులు, ఉద్యోగులను అభినందించవలసిందే.


Related Post