సిఎం కెసిఆర్ కు కిషన్ రెడ్డి చురకలు

January 05, 2018


img

అభివృద్ధి..సంక్షేమ పధకాలు అమలుచేయడంలో తెరాస సర్కార్ ను ఎవరూ వేలెత్తి చూపలేరు. ఆ విషయంలో దాని తపన, చిత్తశుద్ధి..చేస్తున్న కృషి..ఆ కారణంగా ఫలితాలు అన్నీ కళ్ళకు కనబడుతూనే ఉన్నాయి. కానీ ప్రజా సంఘాల, ప్రతిపక్షాల గొంతు వినబడనీయకుండా అణచివేస్తుండటాన్ని ఎవరూ హర్షించలేకపోతున్నారు. అదీ...ఒక ఉద్యమపార్టీ అయిన తెరాస చేయడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న ఎం.ఆర్.పి.ఎస్.అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పార్శీగుట్ట వద్ద గల తమ కార్యాలయంలో నిరాహారదీక్షకు పూనుకొంటే దానికి అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను మళ్ళీ అరెస్ట్ చేయడాన్ని భాజపా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. 

అయన హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “మందకృష్ణ మాదిగపై తెరాస సర్కార్ చాలా కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. అయన ప్రజాస్వామ్యబద్దంగా శాంతియుతంగా నిరాహారదీక్ష చేసుకొంటామంటే ప్రభుత్వం అనుమతీయదు. దీక్షకు కూర్చొన్న ఆయనను అరెస్ట్ చేసి మళ్ళీ జైల్లో పెట్టడం చూస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అని అనుమానం కలుగుతోంది. తెలంగాణా సమస్యల గురించి డిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్, మందకృష్ణ మాదిగను నిరాహార దీక్ష చేయడానికి ఎందుకు అనుమతించడం లేదు? అయన ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న కారణంగానే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయనపై కక్ష కట్టి ఈవిధంగా వేధిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనపై గవర్నర్ నరసింహన్ స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము,” అని అన్నారు.         

మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు శాంతియుతంగా సభలు, ధర్నాలు, ర్యాలీలు చేసుకొనే హక్కు కలిగి ఉన్నప్పటికీ, రాష్ట్రంలో అందుకు ఎవరినీ అనుమతించకపోవడం చేత కాంగ్రెస్ నేతలు, ప్రొఫెసర్ కోదండరాం వంటివారు హైకోర్టుకు వెళ్ళి అనుమతులు తెచ్చుకొని సభలు నిర్వహించుకోవలసివస్తోంది. అప్పుడు వారు ఇదే అంశం ప్రధానంగా ప్రస్తావించి ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ప్రశ్నిస్తున్నారు. తెరాస సర్కార్ రాష్ట్రాన్ని ఎంతగా అభివృద్ధి చేస్తున్నప్పటికీ, ఈ ఒక్క కారణంగా ప్రజలలో దాని పట్ల వ్యతిరేకత ఏర్పడుతోందని గ్రహించడం అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


Related Post