నేను కూడా వచ్చేస్తున్నా: కమల్ హాసన్

January 04, 2018


img

తమిళనాడు సూపర్ హీరో రజనీకాంత్ రాజకీయాలలోకి ప్రవేశించబోతున్నట్లు డిసెంబర్ 31న ప్రకటించి అందుకు ఏర్పాట్లు చురుకుగా చేసుకొంటున్నారు. అయన కంటే ముందు రాజకీయాలలోకి వస్తానని ప్రకటించిన కమల్ హాసన్, ఆ తరువాత కాస్త వెనక్కు తగ్గి, మరో 10 నెలలలో కొత్త పార్టీతో ప్రజల ముందుకు వస్తానని తేల్చి చెప్పారు. ఈలోగా రజనీకాంత్ ఎంట్రీ ఇవ్వడంతో ఆయన ఆలోచనలో ఏమైనా మార్పు రావచ్చని అందరూ అనుకొన్నారు. కానీ కమల్ హాసన్ గురువారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ, “నేను ఒప్పుకొన్న రెండు సినిమాలు పూర్తి చేసిన వెంటనే నేను ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తాను. నేను రాజకీయాలలోకి వస్తానని ఎప్పుడో చెప్పాను. ఆ మాట విని నా అభిమానులు చాలా బాధపడ్డారు కూడా. అయితే చెప్పిన మాట ప్రకారం నేను తప్పకుండా రాజకీయాలలోకి వస్తాను,” అని అన్నారు.

తమిళనాడు రాజకీయాలలో నెలకొన్న అనిశ్చితిని అవినీతిని తొలగించేందుకే తాము రాజకీయాలలోకి వస్తున్నామని రజనీకాంత్, కమల్ హాసన్ చెపుతున్నారు. కానీ  ఒకేసారి ఇద్దరు సూపర్ స్టార్లు వేర్వేరు పార్టీలు పెట్టుకొని రాజకీయాలలో ప్రవేశిస్తే, ఇప్పటికే అరడజనుకు పైగా ఉన్న రాజకీయపార్టీలకు, కొత్తగా వస్తున్న వీరిద్దరి పార్టీలకు మద్య ఓట్లు చీలిపోవడం ఖాయం. అప్పుడు రాష్ట్ర రాజకీయాలలో ఇంకా నాటకీయ పరిణామాలు, ఇంకా అనిశ్చితి పెరుగవచ్చు. ఈ సంగతి వారిద్దరికీ తెలియదనుకోలేము. కనుక వారిరువురు చేతులు కలుపుతారా లేక ఎవరి కుంపటి వారిదేనని ఒకరితో మరొకరు పోటీలుపడుతూ రాష్ట్రాన్ని ఇంకా సంక్షోభంలోకి నెట్టేస్తారో చూడాలి. 


Related Post