గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చిన్న తేడాతో ఓడిపోయినప్పటికీ అక్కడి ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం నింపాయి. అక్కడ అమలుచేసిన వ్యూహాలలో చిన్న చిన్న లోపాలను సవరించుకొని, వాటికి ఇంకా మెరుగులు దిద్ది తెలంగాణాతో సహా ఇతర రాష్ట్రాలలో కూడా అమలుచేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అప్పుడే చెప్పారు.
గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహాన్ని అమలుచేసింది. ఎన్నికలకు చాలా ముందుగానే ‘మీడియా కో-ఆర్డినేటర్స్’ తో కూడిన ఒక ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసుకొంది. వారు గుజరాత్ లో నియోజకవర్గాల వారిగా అమూల్యమైన డేటాను సేకరించి పార్టీ వ్యూహకర్తలకు అందించారు.
ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో ఎంతమంది యువత ఉంది? ఏ వయసు వారు ఎంత మంది ఉన్నారు? వారిలో పురుషులు ఎంతమంది? మహిళలు ఎంతమంది? వారు ప్రభుత్వం నుంచి ఏమి కోరుకొంటున్నారు? అక్కడ ఏమేమి స్థానిక సమస్యలున్నాయి? అపరిష్కృత సమస్యలేమిటి? వంటి డేటాను వివిధ మార్గాల ద్వారా సేకరించి పార్టీ వ్యూహకర్తలకు అందించడంతో తదనుగుణంగానే వ్యూహరచనలు చేసుకొన్నారు.
అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా ప్రతీ నియోజకవర్గంలో ఆయా వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ఈసారి గుజరాత్ లో చాలా విన్నూత్నమైన ప్రచారం చేశారు. దానితో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు వచ్చాయి.
కానీ ఎన్నికల ప్రచారం కీలకదశకు చేరుకొన్నప్పుడు సీనియర్ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశ్యించి చేసిన అనుచిత వ్యాఖ్యలు, రామ జన్మభూమిపై కపిల్ సిబాల్ కోర్టులో చేసిన వ్యాఖ్యలు, ఇంకా మరికొన్ని చిన్న చిన్న పొరపాటుల వలన కాంగ్రెస్ పార్టీ చేతికి విజయం అందినట్లే అంది చేజారిపోయింది.
తమ వ్యూహాలను, వాటిలో దొర్లిన లోపాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా సమీక్ష జరిపి వాటిని నిర్దిష్టంగా గుర్తించారు. ఆ లోపాలను సరిదిద్దుకొని, తమ వ్యూహాలను మరింత మెరుగుపరిచి ఇతర రాష్ట్రాలలో కూడా ప్రయోగించి సత్ఫలితాలు రాబట్టగలమని నమ్మకంగా చెప్పారు.
వచ్చే ఎన్నికలలో తెలంగాణా రాష్ట్రంలో కూడా గుజరాత్ లో అమలుచేసిన వ్యూహాలనే అమలుచేయడానికి, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ కుంతియా నేతృత్వంలో సమాలోచనలు చేస్తున్నారు. త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ‘మీడియా కోర్డినేటింగ్ టీం’ ను ఏర్పాటు చేసుకొని ‘పని’ మొదలుపెట్టాలని నిర్ణయించారు. అలాగే పార్టీలో క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయలేకపోతున్న కొందరు సీనియర్లను తప్పించి, ఉత్సాహవంతులైన యువతకు బాధ్యతలు అప్పగించాలనుకొంటున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
జనవరి నెలాఖరులోగా రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా వరంగల్ లో ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేయబోతున్నట్లు కుంతియా చెప్పారు. కనుక రాహుల్ గాంధీ పర్యటన తరువాత కాంగ్రెస్ పార్టీలో ‘ఎన్నికల పనులు’ మొదలుపెట్టే అవకాశం ఉంది.