త్వరలో కొత్త రాజకీయ పార్టీతో ప్రత్యక్ష రాజకీయాలలోకి రాబోతున్న కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నిన్న సాయంత్రం డిఎంకె అధినేత కరుణానిధి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పార్టీ ముఖ్యనేతలు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలకడం, అయన పెద్దాయన ఆశీర్వాదం తీసుకోవడంవంటి రాజకీయ పరిణామాలు ప్రస్తుతం తమిళనాడులో కొత్త చర్చలకు తెర తీసాయి. వాటిపై రజనీకాంత్ కానీ, అయన ప్రతినిధిగా వ్యవహరిస్తున్న అయన సోదరుడు సత్యనారాయణ గానీ స్పందించలేదు కానీ డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ స్పందించారు.
“రజనీకాంత్ కొత్తగా రాజకీయాలలోకి ప్రవేశిస్తునందున మా తండ్రిగారి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చారు తప్ప వేరే ఉద్దేశ్యంతో రాలేదు. ఒకవేళ రజనీకాంత్ పార్టీ పెట్టిన తరువాత మమ్మల్ని పొత్తుల కోసం సంప్రదిస్తే, అప్పుడు వాటి గురించి ఆలోచిస్తాము. రాష్ట్రంలో నెలకొనున్న ద్రవిడ సంస్కృతిని విచ్చిన్నం చేయడానికే రజనీకాంత్ రాజకీయాలలోకి వస్తున్నారని అయన అనుచరులు చేస్తున్న ప్రచారం నిజమైతే ఆయనను మేమే ముందు గట్టిగా ఎదుర్కొంటాము. ఎందుకంటే పెరియార్, అన్నాదురై, కరుణానిధి వంటి మహానేతలతో ఈ ద్రవిడభూమి (తమిళనాడు) తరించింది. గతంలో అనేకమంది విఫలయత్నాలు చేసారు. కనుక రజనీకాంత్ అటువంటి ఆలోచనలు చేయరని భావిస్తున్నాము. చేస్తే అయన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారడం తధ్యం. తనది ఆధ్యాత్మిక రాజకీయ పార్టీ అని ఆయన చెప్పుకొన్నారు. కనుక అది ఏర్పాటు అయ్యి దాని ఆశయాలు, సిద్దాంతాలు ప్రకటించేవరకు ఎటువంటి అభిప్రాయం ఏర్పరచుకోవడం తొందరపాటే అవుతుందని భావిస్తున్నాము,” అని అన్నారు.