రజనీకాంత్ మొదటి తప్పటడుగు!

January 03, 2018


img

కొత్త పార్టీతో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించి వచ్చే శాసనసభ ఎన్నికలలో రాష్ట్రంలో అన్ని స్థానాలకు పోటీ చేస్తానని ప్రకటించిన రజనీకాంత్ అప్పుడే మొట్టమొదటి తప్పటడుగు వేసినట్లే ఉన్నారు.

రెండు రోజుల క్రితమే అయన తన అభిమానులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ ఇంతవరకు రాష్ట్రాన్ని పాలించిన రెండు పార్టీలు (అన్నాడిఎంకె, డిఎంకె) రాష్ట్రాన్ని దోచుకుతిన్నాయని, వాటి నీచ రాజకీయాల కారణంగా తమిళనాడు రాష్ట్రం పరువుపోయిందని, వాటిని చూసి తమిళనాడు ప్రజలు సిగ్గుతో తలదించుకోవలసి వచ్చిందని ఆవేశంగా విమర్శలు గుప్పించారు. భ్రష్టు పట్టిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడానికే తాను రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నానని చెప్పుకొన్నారు. 

ఇన్ని మాటలు చెప్పిన రజనీకాంత్ ఈరోజు సాయంత్రం చెన్నైలో గోపాలపురంలోని డిఎంకె అధినేత కరుణానిధి ఇంటికి వెళ్ళి ఆయనతో భేటీ అయ్యారు. రజనీకాంత్ తమపట్ల అంత నీచమైన అభిప్రాయలు వ్యక్తం చేసినప్పటికీ కరుణానిధి కుమారుడు, డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, డిఎంకే సభ్యులు రజనీకాంత్ కు సాదరంగా స్వాగతం పలకడం వారి రాజనీతికి, రాజకీయ పరిపక్వతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రజనీకాంత్-కరుణానిధి భేటీలో స్టాలిన్ కూడా పాల్గొన్నారు. అనంతరం రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ తాను రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నందున పెద్దాయన ఆశీర్వాదం తీసుకోవడానికే వచ్చానని అంతకు మించి మరే కారణం లేదని చెప్పారు.

అయితే తాను తప్పు పట్టిన కరుణానిధి ఆశీర్వాదాలు కోరడం ద్వారా డిఎంకె పార్టీతో పొత్తులు కోరుకొంటున్నాననే తప్పుడు సంకేతాలు ప్రజలకు పంపించినట్లయింది. తన అభిమానులను అయోమయానికి గురి చేసినట్లయింది. ఇవ్వాళ్ళ కరుణానిధిని కలిసారు కనుక రేపు మిగిలిన పార్టీల నేతలను కూడా కలువగలరా? కలవకపోతే అర్ధం ఏమిటి? అదే కదా? బహుశః వారి భేటీపై అన్నాడిఎంకె, కాంగ్రెస్, భాజపా తదితర పార్టీలు నేడోరేపో విమర్శలు గుప్పించడం మొదలుపెట్టినా ఆశ్చర్యం లేదు.


Related Post