దేశంలో అన్ని రాష్ట్రాలలో కేంద్రప్రభుత్వం అనేక అభివృద్ధి పనులను చేపడుతుంటుంది. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు బారీగా నిధులు విడుదల చేస్తుంటుంది. తెలంగాణాలో నిర్మితమవుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, పలు సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం తనవంతు వాటాగా బారీగా నిధులు మంజూరు చేస్తోంది. అదేవిధంగా స్వచ్చా భారత్ వంటి పలుపధకాల అమలుకు అవసరమైన నిధులు, సహాయసహకారాలు అందిస్తుంటుంది. అదేవిధంగా ఉదయ్ పధకంలో భాగంగా మిగులు విద్యుత్ ను తెలంగాణాతో సహా వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది.
అయితే రెండు తెలుగు రాష్ట్రాలతో సహా భాజపాయేతర ప్రభుత్వాలు కేంద్రం అందిస్తున్న ఆ సహాయసహకారాలతో జరుగుతున్న పనులను తమవిగా చెప్పుకొంటూ, కేంద్రానికి దక్కవలసిన ‘క్రెడిట్’ ను తమ ఖాతాలో రాసుకొంటున్నాయి. అది సహజమే కానీ కేంద్రం అందిస్తున్న బారీ నిధులు, సహాయసహకారాల గురించి భాజపా నేతలు గట్టిగా చెప్పుకోకపోవడం వల్లనే ఈవిధంగా జరుగుతోందని చెప్పక తప్పదు. కనుక ఈవిషయంలో తెరాస, తెదేపా సర్కార్ లను తప్పు పట్టడం కంటే భాజపా నేతలు తమను తామే నిందించుకోవలసి ఉంటుంది.
రాష్ట్ర భాజపా నేతలు కోరితే మోడీ సర్కార్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఎప్పుడెప్పుడు ఎంతెంత నిధులు విడుదల చేసింది.. ఏఏ సంక్షేమ కార్యక్రమాలలో ఏవిధంగా సహాయసహకారాలు అందిస్తున్నదీ గణాంకాలతో సహా పూర్తి వివరాలు అందించి ఉండేది. రాష్ట్ర భాజపా నేతలకు ఆ లెక్కలన్నీ నాలిక మీదే ఉంటాయి గనుక వారు చాలా సునాయాసంగా ఈ విషయాలను అవకాశం దొరికినప్పుడల్లా ప్రజల ముందుంచుతూ, ఆ ‘క్రెడిట్’ లో తమ వాటాను ఎప్పటికప్పుడు క్లెయిం చేసుకొంటున్నట్లయితే, దానిని స్వంతం చేసుకోవడానికి తెరాస, తెదేపా సర్కార్ లు తప్పకుండా కాస్త సందేహించి ఉండేవి.
ఉదాహరణకు తెలంగాణా రాష్ట్రంలో రైతులందరికీ జనవరి 1వ తేదీ నుంచి నిరంతరంగా ఉచిత విద్యుత్ అందించడం గురించి తెరాస సర్కార్ (ఆంధ్రాలో న్యూస్ పేపర్లతో సహా) చాలా పేపర్లలో ఫుల్ పేజి ప్రకటనలు ఇచ్చి, అది తమ గొప్పదనమేనని లోకానికి గట్టిగా చాటిచెప్పుకోగలిగింది.
దానిపై మొట్టమొదట భాజపా స్పందించి ఉండాలి కానీ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. తమ హయంలో నెలకొల్పిన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వచ్చిన విద్యుత్ నే తెరాస సర్కార్ రైతులకు పంచిపెట్టి గొప్పలు చెప్పుకొంటోందని కాంగ్రెస్ నేతలు గట్టిగా చెప్పుకొన్నారు. వారు కూడా ఉదయ్ పధకం ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న నిరంతర విద్యుత్ గురించి చెప్పారు కానీ ఈవిషయంలో కూడా భాజపా వెనుకబడిపోయింది. ఆ తరువాత రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఉదయ్ పధకం గురించి చెప్పుకొన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్ర విద్యుత్ సంక్షోభంలో విడిచిపెట్టిన కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ధైర్యంగా ఉచిత విద్యుత్ పై క్రెడిట్ ను క్లెయిం చేసుకొంది కానీ కేంద్రానికి, భాజపాకు దక్కవలసిన ఆ క్రెడిట్ ను రాష్ట్ర భాజపా నేతలు క్లెయిం చేసుకోలేకపోవడం ఆశ్చర్యకరమే. భాజపా నేతలు ఇంత డీలాపడి ఉంటే ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారంలోకి వస్తామని ఏవిధంగా కలలు కంటున్నారో?