ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చకు భయమెందుకు?

January 03, 2018


img

ఊహించినట్లుగానే ఈరోజు రాజ్యసభలో వివాదాస్పద ముస్లిం మహిళల వివాహ రక్షణ హక్కుల బిల్లు (ట్రిపుల్ తలాక్ బిల్లు)పై అధికార, ప్రతిపక్ష సభ్యుల మద్య వాడివేడిగా వాదోపవాదాలు జరిగాయి. దానిపై మరింత లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి ఆ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. కానీ దానిని స్టాండింగ్ కమిటీకి పంపించవలసిన అవసరం లేదని చెపుతూ ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ నిరాకరించారు. అయితే అందుకు బలమైన కారణం ఏదీ చెప్పలేక పోయారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో మెజారిటీ సభ్యుల అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా ప్రభుత్వాభిప్రాయాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దాలనుకోవడం సరికాదని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద శర్మ వాదించారు. ప్రతిపక్షాలు ఎంతగా పట్టుబట్టినప్పటికీ మోడీ సర్కార్ మెట్టు దిగకపోవడంతో, అ బిల్లుపై ‘డివిజన్ ఆఫ్ ఓట్స్’ (మెజారిటీ సభ్యుల అభిప్రాయానికి అనుగుణంగా జరిగే ఓటింగ్ ప్రక్రియ) కోసం కాంగ్రెస్..దాని మిత్రపక్షాలు గట్టిగా పట్టుబట్టాయి. అదే జరిగితే ఆ బిల్లు రాజ్యసభలో ఓడిపోవడం ఖాయం కనుక మోడీ సర్కార్ దానికీ అంగీకరించలేదు. అప్పుడు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు సభను స్తంభింపజేయడంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పి.జె. కురియన్ సభను రేపటికి వాయిదా వేశారు.  

కోట్లాది ముస్లింల మనోభావాలకు, మతాచారాలకు సంబంధించిన, కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేయబోయే ఈ ట్రిపుల్ తలాక్ బిల్లుపై తొందరపాటు ఎందుకు? చర్చించడానికి వెనుకాడటం ఎందుకు? ట్రిపుల్ తలాక్ బిల్లు వలన కోట్లాది ముస్లిం మహిళల జీవితాలకు భద్రత కలుగుతుందని మోడీ సర్కార్ గట్టిగా నమ్ముతున్నప్పుడు, ఈ బిల్లుపై లోతుగా చర్చించి, దానిలో ఏవైనా లోపాలున్నట్లయితే వాటిని సవరించడానికి వెనుకాడనవసరం లేదు. ఈ బిల్లుపై లోతుగా చర్చించకుండా, ప్రతిపక్షాలు సూచిస్తున్న లోపాలను సవరించకుండా హడావుడిగా దానికి రాజ్యసభ చేత కూడా ఆమోదముద్ర వేయించాలని ప్రయత్నిస్తుండటం అనుమానాలకు, అపోహలకు, తీవ్ర విమర్శలకు  తావిస్తుందని మరిచిపోకూడదు. ప్రతిపక్షాల ఒత్తిడి కారణంగా రేపు ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపవలసి వచ్చినా లేదా దానికి రాజ్యసభ ఆమోదముద్ర పడకపోయినా అప్పుడు ఇంకా ఎక్కువ అప్రదిష్ట మూటగట్టుకోవలసి ఉంటుందని గ్రహిస్తే మంచిది. 


Related Post