అమెరికాపై పాక్ అణుబాంబులు వేయాలిట!

January 03, 2018


img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నూతన సంవత్సరంలో మొదటి రోజునే ఇచ్చిన షాక్ నుంచి పాకిస్తాన్ ఇంకా తేరుకోలేకపోతోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న కారణంగా పాక్ కు అందిస్తున్న ఆర్ధిక సహాయాన్ని అమెరికా నిలిపివేసింది.

గత 15 ఏళ్ళుగా అమెరికా 33 బిలియన్ డాలర్ల ఆర్ధిక సహాయం అందించినందుకు పాక్ పాలకులు, ప్రతిపక్షాలు కృతజ్ఞత చూపకపోగా, అది దాని బాధ్యత అన్నట్లుగా మాట్లాడుతూ అమెరికాపై నిప్పులు చెరుగుతున్నారు. భారత్ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుడు మాటలు వినే డోనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకొన్నారని అధికార, ప్రతిపక్షాలతో సహా కరడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఆరోపిస్తున్నారు. అమెరికాపై పాకిస్తాన్ అణుబాంబు ప్రయోగించాలని హఫీజ్ సయీద్ డిమాండ్ చేశాడు.

ఇక మాజీ క్రికెటర్,తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ కూడా భారత్ కారణంగానే పాకిస్తాన్ కు నిధులు నిలిచిపోయాయని ఆరోపించారు.

పాక్ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీ నేతృత్వంలో జరిగిన జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో పాల్గొన్న సభ్యులు కూడా ఇంచుమించు అటువంటి అభిప్రాయాలే వ్యక్తం చేశారు. ఒకవేళ అమెరికా తన నిర్ణయం మార్చుకోకపోతే ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాల గురించి పునరాలోచించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. 

పాకిస్తాన్ కు ఏటా అప్పనంగా అందుతున్న లక్షల కోట్లు ఒక్కసారిగా ట్రంప్ నిలిపివేయడంతో పాక్ పాలకులకు, ప్రతిపక్షాలకు ఆగ్రహం కలగడం సహజమే. అయితే “అత్త కొట్టినందుకు కాదు..అది చూసి తోడికోడలు నవ్వినందుకు ఏడుస్తున్నాను” అన్నట్లుంది పాక్ తీరు. అమెరికా ఆర్ధిక సహాయం నిలిపివేసినందుకు కాదు..దానిని భారత్ నిలిపివేయించినందుకు అది ఎక్కువ బాధపడుతోంది. అలాగే తమ కళ్ళెదుటే ఉగ్రవాదులు స్వేచ్చగా తిరుగుతున్నా ఏమీ చేయలేకపోతున్న పాక్ పాలకులు, "మీ దేశంలో ఉగ్రవాదులకు నిలయంగా మారింది" అని ట్రంప్ వేలెత్తి చూపినందుకు ఎక్కువ బాధపడుతోంది. 

ప్రపంచంలో మరే దేశానికి ఇన్నేళ్ళుగా ఇన్ని లక్షల కోట్లు అప్పనంగా లభించలేదు. అప్పనంగా లభించిన దానిని పాక్ సక్రమంగా వినియోగించుకొని ఉండి ఉంటే నేడు పాక్ పరిస్థితి వేరేలా ఉండేది. కానీ దానినీ ఉగ్రవాదులను పోషించడానికే ఖర్చు చేస్తూ, ఇంకా ఎల్లప్పటికీ అమెరికా తమకు ఉదారంగా ఆర్ధిక సహాయం అందిస్తూనే ఉండాలని పాక్ ఆశిస్తున్నట్లుంది. అందుకే అమెరికా సహాయం నిలిపివేయగానే దానిపై రంకెలు వేస్తున్నారు. అయినా అమెరికా ప్రజలు కష్టపడి సంపాదించుకొని కడుతున్న పన్నులను, అకారణంగా అమెరికాను ద్వేషిస్తున్న, మోసగిస్తున్న పాకిస్తాన్ కు ఎందుకు ఇవ్వాలి? అని ఆలోచిస్తే పాక్ వాదనలు ఎంత అర్ధరహితమో అర్ధమవుతాయి.   

ఇంతకాలంగా తమ దేశానికి సహాయం అందించిన అమెరికాపై అణుబాంబులు వేయాలని హఫీజ్ సయీద్ పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఏ స్థాయిలో ఉన్నారో నిరూపిస్తోంది. అటువంటి కరడుగట్టిన ఉగ్రవాది రాజకీయ పార్టీ పెట్టి పాక్ లో అధికారంలోకి రావాలనుకొంటున్నాడు. అదే జరిగితే ఏమవుతుంది? కనుక అటువంటి ఉగ్రవాదులను పాక్ సర్కార్ శిక్షించాలంటే దాని చేత ఇటువంటి చేదు మాత్రలు మింగించక తప్పదు.


Related Post