ప్రతిపక్షాలు మళ్ళీ మేల్కొన్నాయా?

January 03, 2018


img

నేరెళ్ళ భాదితులకు న్యాయం చేయాలంటూ జనవరి 6న సిద్ధిపేట నుంచి నేరెళ్ళ వరకు పాదయాత్ర చేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. మంగళవారం హైదరాబాద్ లోని మఖ్దూం భవన్ లో జరిగిన సమావేశంలో టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట రెడ్డి, సిపిఐ(ఎం), సిపిఐ(ఎం.ఎల్-న్యూ డెమోక్రసీ), ఆర్.ఎస్.పి., ఎన్.యు.సి.ఐ-సి. తదితర పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పాదయాత్ర వాల్ పోస్టరును విడుదల చేశారు. 

ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, “నేరెళ్ళ భాదితులను ఆదుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం వారి పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుండటం చాలా బాధాకరం. వారిపై దాడి జరిగి ఆరున్నర నెలలు గడిచిన ప్రభుత్వం దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. భాదితులకు న్యాయం చేయలేదు. తెరాస సర్కార్ ఇసుక మాఫియాపై ఉన్న శ్రద్ధ దళితులపై కనబడటం లేదు. ప్రభుత్వం తన తీరు మార్చుకోకుంటే ప్రజలు దానికి గట్టిగా బుద్ధి చెపుతారు,” అని హెచ్చరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మిగిలినవారు కూడా నేరెళ్ళ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయకపోవడాన్ని గట్టిగా విమర్శించారు.  

నేరెళ్ళ ఘటన జరిగి ఆరున్నర నెలలు గడిచిపోయినా ఇంతవరకు బాధితులకు న్యాయం జరుగకపోవడం నిజంగా బాధాకరమే. మూడు వారాల క్రితం ఈశ్వర్ అనే నేరెళ్ళ బాధితుడు తనకు న్యాయం జరగనందుకు నిరసనగా సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోబోయాడు. అక్కడున్నవారు సకాలంలో అతనిని అడ్డుకొని కాపాడగలిగారు. అతని ఆవేదనను చూస్తే నేటికీ నేరెళ్ళ బాధితులు ఎన్ని బాధలు పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. 


అయితే నేరెళ్ళ బాధితులకు తెరాస సర్కార్ న్యాయం చేయడం లేదని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలైనా వారి కోసం ప్రభుత్వంతో  గట్టిగా పోరాడాయా? అంటే లేదనే చెప్పక తప్పదు. అవి ఈ సమస్యపై భాధితులకు న్యాయం జరిగేవరకు దీర్ఘకాలం పోరాటాలు చేయలేవు. ఎందుకంటే, రాష్ట్రంలో...రాజకీయాలలో ఎప్పటికప్పుడు జరిగే అంశాలు, తలెత్తే సమస్యలలో ఒక దాని నుంచి మరొకదానికి అవి కూడా షిఫ్ట్ అయిపోతూ ముందుకు సాగిపోక తప్పని పరిస్థితి. ప్రభుత్వంతో పోరాడేందుకు వాటి చేతిలో మరే అంశం, సమస్యా లేనప్పుడు మళ్ళీ (‘ఆర్చివ్స్’ లోకి వెళ్ళి) ఇటువంటి పాత సమస్యలపై పోరాటాలు చేస్తుంటాయి. కనుక ప్రతిపక్షాలకు కూడా ప్రజా సమస్యలు, వారి బాధలు తమ ఉనికిని చాటుకోవడానికి లేదా రాజకీయ మైలేజీకి ఉపయోగపడే ఒక రాజకీయ ఆయుధాలే తప్ప నిజంగా వాటి పరిష్కారం కోసం అవి పోరాడుతున్నాయనుకొంటే భ్రమ..అవివేకమే అని చెప్పకతప్పదు. కనుక అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షాలు ఆదుకోనప్పుడు నేరెళ్ళ బాధితులు పైనున్న ఆ దేవుడికే మోర పెట్టుకోవాలేమో? 

(వీడియో : న్యూస్ ఇండియా సౌజన్యంతో) 


Related Post