మందకృష్ణ మళ్ళీ అరెస్ట్!

January 02, 2018


img

ఇటీవలే జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన ఎం.ఆర్.పి.ఎస్. అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పోలీసులు మళ్ళీ ఈరోజు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాలలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని డమాండ్ చేస్తూ అయన హైదరాబాద్ పార్శీగుట్ట వద్ద గల తమ పార్టీ కార్యాలయంలో నిరాహారదీక్షకు కూర్చొన్నారు. దానికి అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను, అనుచరులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ, “సుమారు రెండున్నర దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నాము. ఎన్నికల సమయంలోనే అన్ని పార్టీలు మాకు మద్దతు ప్రకటిస్తాయి కానీ అధికారంలోకి వచ్చిన తరువాత మరిచిపోతాయి.  మేము గుర్తు చేసినా స్పందించవు. దాని కోసం నిరాహార దీక్షలు చేయడానికి ప్రభుత్వం అనుమతించదు. మాకు ముఖ్యమంత్రి కెసిఆర్ పై వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషమూ లేదు. కానీ శాంతియుతంగా చేస్తున్న ఇటువంటి ఉద్యమాలను పోలీసులతో అణచివేయాలని ప్రయత్నించి మాదిగలను దూరం చేసుకోవద్దని సూచిస్తున్నాను. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ చొరవ తీసుకొని అఖిలపక్షాన్ని డిల్లీకి తీసుకువెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీతో దీని గురించి మాట్లాడించాలి. ఒకవేళ ముఖ్యమంత్రి కెసిఆర్ చొరవ చూపకపోతే రాష్ట్ర భాజపా నేతలు చొరవ తీసుకొని దీని కోసం ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడి ఒప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

ఒకప్పుడు తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేస్తున్న వారిని అరెస్టులు చేసినప్పుడు కెసిఆర్ తో సహా తెరాస నేతలు తప్పు పట్టేవారు. గట్టిగా ఖండించేవారు. నిర్బంధాలతో తమ ఉద్యమాలను ఆపలేరని హెచ్చరిస్తుండేవారు. తెరాస నేతృత్వంలో సాగిన ఉద్యమాలు ఫలించి తెలంగాణా ఏర్పడింది. ఉద్యమ పార్టీ అయిన తెరాసయే అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎవరూ దేనికీ నిరసనలు తెలియజేయకూడదని ఆంక్షలు విధిస్తోంది. ఎవరైనా అటువంటి ప్రయత్నాలు చేస్తే వారిని వెంటనే అరెస్టులు చేస్తోంది. 

మందకృష్ణ మాదిగకు నగరంలో ఎక్కడా నిరాహార దీక్ష చేయడానికి అనుమతించకపోవడమే కాక ఆయన తన కార్యాలయంలో దీక్ష చేసుకోవడానికి అనుమతి లేదంటూ అరెస్ట్ చేయడం శోచనీయం. ఒక ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇంత నిరంకుశంగా ప్రవర్తిస్తుందనుకోలేదని ప్రతిపక్షాలు వాదనను తెరాస కాదనగాలదా? 


Related Post