జగన్ కత్తిని మహేష్ ఉపయోగిస్తున్నారా?

January 02, 2018


img

బిగ్ బాస్ రియాల్టీ షోతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన సినీ విమర్శకుడు మహేష్ కత్తి, జనసేనాని పవన్ కళ్యాణ్ పై చేస్తున్న తీవ్ర విమర్శలు పవన్ కంటే అతనిపైనే ఎక్కువ అనుమానాలు కలిగించేవిధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సోమవారం ప్రగతి భవన్ కు వెళ్ళి ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలపడంపై మహేష్ కత్తి విమర్శలు చేయడమే అనుమానాలు కలిగిస్తున్నాయి. 

“ప్రగతి భవన్ లో పవన్ కళ్యాణ్ పడిగాపులు. ముఖ్యమంత్రికి న్యూ ఇయర్ విషస్ చెప్పడానికా? అజ్ఞాతవాసి ప్రీమియర్ల పర్మిషన్ కా?” అని మహేష్ కత్తి ఫేస్ బుక్ లో వ్యంగ్యంగా ఒక మెసేజ్ పోస్ట్ చేశారు.

పవన్ కళ్యాణ్ ప్రగతి భవన్ కు చేరుకొనే సమయానికి ముఖ్యమంత్రి కెసిఆర్ గవర్నర్ నరసింహన్, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగరాజన్ లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు బయటకు వెళ్ళారు. కనుక ముఖ్యమంత్రి కెసిఆర్ తిరిగివచ్చే వరకు ఎదురుచూడవలసి వచ్చింది. దానికి మహేష్ కత్తి ఈవిధంగా వక్రబాష్యం చెప్పడం గమనిస్తే అయన పవన్ కళ్యాణ్ పై ఎందుకో కత్తి కట్టినట్లు కనిపిస్తున్నారు. ఆయనకు సాక్షి మీడియా మంచి కవరేజ్ ఇస్తుండటం గమనిస్తే అయన చేతిలో ఉన్న ఆ కత్తి జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఉండవచ్చని అనుమానం కలుగుతోంది. ఇంతవరకు సినిమాలకే పరిమితమైన మహేష్ కత్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులను ముడివేస్తూ రాజకీయ వ్యాఖ్యలు చేస్తుండటం గమనిస్తే ఆ అనుమానాలు నిజమేననిపించకమానవు.   

2009 ఎన్నికలలో చిరంజీవి ప్రజారాజ్యంతో బరిలోకి దిగడం వలన ఓట్లు చీలి వైకాపా నష్టపోయింది. 2014 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తెదేపా, భాజపా కూటమికి మద్దతు ప్రకటించడం వలన మళ్ళీ వైకాపా నష్టపోయింది. 2019 ఎన్నికలలో    జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ఇదివరకే ప్రకటించారు. అంటే ఈసారి పవన్ కళ్యాణ్ ఓట్లు చీల్చడం వలన వైకాపా మళ్ళీ నష్టపోయే అవకాశాలున్నాయని అర్ధం అవుతోంది. కనుక సినీ నటుడైన పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా దెబ్బ తీయడానికి జగన్మోహన్ రెడ్డి సినీ విమర్శకుడైన మహేష్ కత్తిని ఎంచుకొని ఉండవచ్చు. మహేష్ కత్తికి కూడా ఏదోవిధంగా ప్రజల దృష్టిని ఆకర్షించి ఇంకా పైకి ఎదగాలనే ఆలోచనలో ఉన్నట్లే కనిపిస్తున్నారు.

“పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే ఏపిలో మొత్తం అన్ని సీట్లకు పోటీ చేస్తానని ప్రకటించమనండి...తక్షణమే చంద్రబాబు నాయుడు ఆయనను దూరం పెడతారు... పవన్ కళ్యాణ్ ను ఎదుర్కోవడానికి అవసరమైతే నేను కూడా రాజకీయాలలోకి వస్తాను.. నా భావాలకు దగ్గరగా ఉండే పార్టీ(?)లో చేరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకాలను ప్రజల ముందుంచుతాను,” అంటూ మహేష్ కత్తి చేస్తున్న సవాళ్ళు, మాటలు అన్నీ వైకాపా ఆలోచనకు అద్దం పడుతున్నట్లున్నాయి. 

చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ను తన ఆయుధంగా వాడుకొంటున్నారని ఆరోపిస్తున్న మహేష్ కత్తిని, కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని జగన్మోహన్ రెడ్డి ఆయుధాలుగా వాడుకొంటున్నట్లు అనుమానించక తప్పదు.


Related Post