పాక్ మమ్మల్ని మోసగించింది అందుకే...

January 01, 2018


img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోమవారం పాకిస్తాన్ పై నిప్పులు చెరిగి, ఇక నుంచి ఆ దేశానికి చిల్లి గవ్వ కూడా ఇవ్వబోమని ప్రకటించారు.

 “గత 15 ఏళ్లుగా మేము ఆ దేశానికి 33 బిలియన్ డాలర్లు ఆర్ధిక సహాయం చేశాము. అది చాలా తెలివి తక్కువ పని అని భావిస్తున్నాను. పాక్ కు మేమందించిన సాయానికి ప్రతిగా అది మమ్మల్ని మూర్ఖులని భావిస్తూ అబద్దాలు చెపుతూ మమ్మల్ని మోసం చేస్తూనే ఉంది. ఆఫ్ఘనిస్తాన్ లో మా సైనికులు ప్రాణాలు పణంగా పెట్టి ఉగ్రవాదులను నిర్మూలించే ప్రయత్నాలు చేస్తుంటే, వారికి పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు నిలయంగా మారింది. కనుక ఇకపై పాకిస్తాన్ కు మానుండి ఎటువంటి ఆర్ధిక సహాయం లభించదని స్పష్టం చేస్తున్నాను,” అని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. 

‘ఉగ్రవాదంపై పోరు’ కోసం అనే పేరుతో అమెరికా ఏటా పాకిస్తాన్ కు లక్షల కోట్లు ఆర్ధిక సహాయం అందించేది. పాక్ ప్రభుత్వం నిజంగా దానిని ఉగ్రవాద నిర్మూలనకు వినియోగించి ఉండి ఉంటే, దానితో బాటు భారత్ కు కూడా ఉపశమనం లభించి ఉండేది. కానీ భారత్ పై పగతో రగిలిపోతున్న పాక్ సైన్యాధికారులు, ఐఎస్ఐ ఉన్నతాధికారులు అందరూ కలిసి ఉగ్రవాదులను తయారుచేసి వారిని భారత్ పై దాడులకు పంపించేందుకు, కాశ్మీర్ లో అల్లకల్లోలం సృష్టించేందుకు ఆ సొమ్మును దురుపయోగం చేశారు. 

ఈ సంగతి అమెరికా గత పాలకులకు తెలియదనుకోలేము. అయినా గత 15 ఏళ్లుగా ఏటా పాకిస్తాన్ కు ‘రౌడీ మామూలు’ చెల్లిస్తూనే ఉన్నారు. పాక్ వంటి ధూర్తదేశం భారత్ కు పక్కలో బల్లెంగా లేకపోయినట్లయితే అది ఆసియాలో శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందనే భయం కావచ్చు. కారణాలు ఏవైనప్పటికీ పాక్ తమని మోసం చేస్తోందని తెలిసి ఉన్నప్పటికీ అమెరికా దానికి రౌడీ మామూలు చెల్లిస్తూనే ఉంది. 

ఒకప్పుడు అమెరికా పాలకులు గొప్ప విదేశాంగ విధానం (పాక్ కు ఆర్ధిక సహాయం అందించడం) అనుకొన్నది తెలివితక్కువ అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా చాటి చెప్పినట్లు భావించవచ్చు. ఇప్పటికైనా పాకిస్తాన్ కు అమెరికా ఆర్ధిక సహాయం నిలిపివేసింది కనుక అది పాకిస్తాన్ ఆర్ధిక పరిస్థితిపై, ముఖ్యంగా దాని తీవ్రవాద కలాపాలాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 

ప్రధాని మోడీ-ట్రంప్ భేటీ తరువాత నుంచి పాక్ పట్ల అమెరికా వైఖరిలో క్రమంగా స్పష్టమైన మార్పు కనబడుతోంది. అందుకు నేటి ట్రంప్ ప్రకటనను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఉగ్రవాదులకు కేంద్రంగా మారిన పాక్ ను ప్రపంచదేశాలలో ఏకాకిగా నిలబెట్టాలని ప్రధాని మోడీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే కనిపిస్తున్నాయి.


Related Post