వరంగల్-కరీంనగర్ కు కొత్త అందాలు!

December 30, 2017


img

గత ఏడు దశాబ్దాలుగా రాష్ట్రంలో అభివృద్ధి అంటే అది హైదరాబాద్ లో మాత్రమే జరుగుతుందనుకొనేవారు అందరూ. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు అన్ని జిల్లాలు అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయాయి. అందుకు నిదర్శనంగా రెండు రాష్ట్రాలలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ఏటా జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున నిధులు విడుదల చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే తెలంగాణా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అన్ని జిల్లాలను సమాంతరంగా అభివృద్ధి చేస్తోంది తెరాస సర్కార్.

మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర రావు శనివారం కరీంనగర్ పట్టణం శివారులో మానేరు నదిపై తీగలపై వ్రేలాడే వంతెన (కేబుల్ బ్రిడ్జ్) నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. రూ.148 కోట్లు వ్యయంతో నిర్మించబోతున్న ఈ వంతెన 520 మీటర్ల పొడవు, 21.5 మీటర్ల వెడల్పు ఉంటుంది. దీనిని కరీంనగర్-వరంగల్ పాత రహదారి మార్గంలో నిర్మించబోతున్నారు. ఇది అందుబాటులోకి వస్తే కరీంనగర్-వరంగల్ జిల్లాల మద్య ప్రయాణదూరం సుమారు 5కిమీ తగ్గుతుంది. 

లోవర్ మానేరు డ్యాం పరిసర ప్రాంతాలను హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ లాగ అందంగా తీర్చిదిద్ది జిల్లాలో ఆ ప్రాంతాన్ని ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తయితే రాష్ట్రంలో అది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 

కరీంనగర్ జిల్లాను పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేసేందుకు చాలా జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మూతపడిన ఫెర్టిలైజర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్.సి.ఐ.)ను రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటడ్ అనే పేరుతో పునః ప్రారంభించబడుతోంది. రామగుండంలోనే 800 మెగావాట్స్ ఉత్పత్తి సామర్ద్యం కలిగిన రెండు ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 

అటు వరంగల్ జిల్లా ఇప్పటికే పారిశ్రామికంగా అభివృద్ధి చెంది, ఐటి రంగంలో హైదరాబాద్ కు ప్రత్యామ్నాయ కేంద్రంగా అవతరించింది. వరంగల్ రూరల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ రాబోతోంది. దానికి అక్టోబర్ లో శంఖుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. కనుక రానున్న రోజులలో వరంగల్, కరీంనగర్ రెండు జిల్లాలు హైదరాబాద్ తో పోటీ పడే స్థాయికి ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది. 


Related Post