గుజరాత్ నవ వధువు కాళ్ళ పారాణీ ఆరనే లేదు...

December 30, 2017


img

‘నవ వధువు కాళ్ళ పారాణీ ఇంకా ఆరనే లేదు..అప్పుడే...’ అంటూ రకరకాల విషాదకర వార్తలు చదువుతుంటాము. గుజరాత్ లో భాజపా సర్కార్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే చెప్పుకోవాలేమో! 

వరుసగా ఆరోసారి గెలిచి అధికారం దక్కించుకొన్నందుకు తిన్న మిఠాయిలు ఇంకా నోట్లోకి దిగనే లేదు. సంబరంగా మొహాలకు పూసుకొన్న రంగులు ఇంకా పోనేలేదు...ఇంతలోనే భాజపా ప్రభుత్వంలో ముసలం పుట్టి కూలిపోయే పరిస్థితులు ఏర్పడటం విశేషం. 

మళ్ళీ రెండవసారి ఉపముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన నితిన్ భాయ్ పటేల్..అయన అనుచరులు తమకు అప్రాధాన్యమైన శాఖలు కేటాయించారని ముఖ్యమంత్రి విజయ్ రూపానీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 92 సీట్లు అవసరంకాగా భాజపాకు 99 సీట్లు మాత్రమే లభించాయి. కనుక బొటాబొటి మెజారిటీతో ఏర్పడిన విజయ్ రూపానీ ప్రభుత్వంపై అసమ్మతివాదుల స్వరం మరికాస్త గట్టిగానే వినిపిస్తున్నారు. 

ఇదే అదునుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న హార్దిక్ పటేల్ మళ్ళీ రంగ ప్రవేశం చేసి, ఉప ముఖ్యమంత్రి నితిన్ భాయ్ పటేల్ కు కాంగ్రెస్ తరపున బంపర్ ఆఫర్ ఇచ్చారు. కేవలం పదిమంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని వచ్చే మాటయితే కాంగ్రెస్ పార్టీ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని, దానిలో ఆయనతో సహా అందరికీ సముచితమైన పదవులు ఇప్పిస్తానని ప్రకటించారు. 

కాంగ్రెస్ పార్టీకి 77 మంది ఎమ్మెల్యేలున్నారు. మరో 10 మంది వస్తే 87మంది అవుతారు. వారితో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదు కానీ ముందుగా భాజపా ప్రభుత్వాన్ని కూల్చివేసి నష్టపరచవచ్చునని హార్దిక్ పటేల్ వ్యూహం కావచ్చు. ఒకవేళ నితిన్ పటేల్ నిజంగానే 10 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దపడితే, అప్పుడు ‘పటేల్’ కుల అస్త్రం సందించి మరో 5-6 మందిని రప్పించడం పెద్ద కష్టమేమీ కాదు. 

గుజరాత్ ఎన్నికల ప్రభావం తెలంగాణా రాష్ట్రంపై ఎంతుంటుంది?కర్నాటకలో కూడా వర్క్ అవుట్ అవుతుందా? అని ఆలోచిస్తున్న భాజపా అధిష్టానం ముందుగా పార్టీలో రేగిన ఈ చిచ్చును వెంటనే ఆర్పుకోవలసి ఉంటుంది. లేకుంటే గోవా, మణిపూర్ రాష్ట్రాలలో అది చేసిన పనికి కాంగ్రెస్ పార్టీ అంతకంటే ఎక్కువగానే ప్రతీకారం తీర్చుకొనే అవకాశాలు కనబడుతున్నాయి. 


Related Post