అలా అయితే మనోభావాలు దెబ్బతినవట!

December 30, 2017


img

రాజస్థాన్ మహారాణి పద్మావతి చరిత్ర ఆధారంగా సంజయ్ లీలా బన్సాలీ రూపొందించిన ‘పద్మావతి’ చిత్రానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఆ సినిమా  పేరును ‘పద్మావత్’ గా మార్చి, సినిమాలో చిన్న చిన్న మార్పులను చేయడానికి సినీ నిర్మాతలు అంగీకరించడంతో, ఆ సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు దానికి యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చి విడుదల చేసుకోవడానికి అంగీకరించారు.         

ఆ సినిమాలో తమకు అత్యంత పూజ్యనీయమైన రాణీ పద్మావతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించేవిధంగా చిత్రీకరించారని ఆరోపిస్తూ రాజస్థాన్ తో సహా పలు రాష్ట్రాలలో ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సినిమా విడుదలను నిషేదించాయి. కనుక ఈ సమస్యను పరిష్కరించేందుకు సెన్సార్ బోర్డు ప్రత్యేకంగా ఒక ప్యానల్ ను ఏర్పాటు చేసింది. అరవింద్ సింగ్, డాక్టర్ చంద్రమణి సింగ్, జైపూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కెకె సింగ్ లు సభ్యులుగా ఉన్న ఆ ప్యానెల్ నిన్న సమావేశమయ్యి ‘పద్మావత్’ సినిమా విడుదలకు అనుమతి మంజూరు చేసింది. కనుక త్వరలోనే ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి.

ఈ సినిమాను రాణీ పద్మావతి జీవిత చరిత్ర ఆధారంగానే తీసినప్పటికీ, ఆమెతో ఈ సినిమాకు ఎటువంటి సంబంధమూ లేదని దర్శకుడు సంజయ్ లీల బన్సాలీ వాదిస్తున్నారు. కానీ అది ఖచ్చితంగా రాణీ పద్మావతి జీవిత చరిత్ర ఆధారంగానే తీసినదేనని ప్రజలు భావిస్తున్నారు. విడుదలకు సిద్దమైన సినిమా కధలో మార్పులు చేయడం అసాధ్యం కనుక పేరులో చిన్న మార్పు చేస్తే సరిపోతుందని సెన్సార్ బోర్డ్ ప్యానెల్ చెప్పడం విడ్డూరంగానే ఉంది. పద్మావతిని పద్మావత్ అని మార్చితే ప్రజల మనోభావాలు దెబ్బతినవని చెప్పడం చాలా విచిత్రంగా ఉంది. పేరు చివర ఒక అక్షరం తొలగించినంత మాత్రాన్న కధాంశం దానిలో పాత్రల తీరు తెన్నులు మారవు కదా! 


Related Post